|
|
by Suryaa Desk | Thu, Apr 17, 2025, 05:12 PM
రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ తరహాలో ప్రజలే స్వయంగా రోడ్లపైకి వచ్చి ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపుతారని ఆయన అన్నారు. ఎందరో నియంతలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి పూర్తికాలం ముఖ్యమంత్రిగా కొనసాగాలని ఆకాంక్షించారు. కంచ గచ్చిబౌలి భూముల విషయంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలతో మరొక ముఖ్యమంత్రి అయితే రాజీనామా చేసేవారని అన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిరికిపంద అని కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాడని దర్శనం వెంకటయ్య అనే దళితుడిని అక్రమంగా జైలుకు పంపారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే భద్రత లేకుండా తెలంగాణలోని ఏ ఊరికైనా రావొచ్చని సవాల్ విసిరారు. ప్రజలు ఈ పాలన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని సూచించారు. రేవంత్ రెడ్డి విదేశాల్లో విలాసయాత్రలు చేస్తుంటే ప్రజలు తప్పకుండా ఆగ్రహిస్తారని, నిందిస్తారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామిక స్ఫూర్తి అవసరమని హితవు పలికారు.హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రూ. 10 వేల కోట్ల కుంభకోణానికి పాల్పడిందని కేటీఆర్ పునరుద్ఘాటించారు. ఈ కుంభకోణం వెలుగులోకి రావాలంటే ఆర్బీఐ కూడా విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. సీబీసీ, సీబీఐ కూడా జోక్యం చేసుకోవాలని కోరారు.కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవేదనను తాను విన్నానని, వారి ఆవేదన నిజమే అయితే తెలంగాణలోని ఆర్థిక దోపిడీపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.ఫార్ములా ఈ-రేసింగ్ కేసులో తనపై నిరాధార ఆరోపణలు చేసినప్పుడు, తాను విధానపరమైన నిర్ణయం తీసుకున్నానని స్పష్టంగా చెప్పానని, కానీ అధికారులను బలిపశువులను చేయలేదని అన్నారు. ఈ విషయంలో విధానపరమైన నిర్ణయానికి బాధ్యత తనదేనని అన్నారు. మంచి జరిగితే తనది, చెడు జరిగితే అధికారులది అని చెప్పే సంస్కృతి తనకు లేదని అన్నారు.