|
|
by Suryaa Desk | Sun, Apr 20, 2025, 07:50 PM
తెలంగాణలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు, ఆదివారం కావడంతో ఉదయం నుంచే భక్తులు క్యూ లైన్లలో బారులు తీరారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. అధిక రద్దీ కారణంగా ఉచిత దర్శనానికి దాదాపు 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంటకు పైగా సమయం పడుతోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. వేసవి వేడిని తట్టుకునేందుకు ఆలయ ఆవరణలో ప్రత్యేకంగా చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు.
ఇక ఇటీవల ఎండోమెంట్స్ సవరణ బిల్లును తెలంగాణ అసెంబ్లీ ఆమోదించింది. ఈ బిల్లు యాదగిరిగుట్ట ఆలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరహాలో ప్రత్యేక ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయడానికి మార్గం సుగమం చేసింది. ప్రతిపాదిత యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు లో చైర్మన్‌తో సహా 18 మంది సభ్యులు ఉంటారు. ఇందులో ఎస్సీ, బీసీ వర్గాల ప్రతినిధులు, ఒక మహిళా ప్రతినిధి మరియు ఒక ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ ఉంటారు. ఒక ఐఏఎస్ అధికారిని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమిస్తారు. బోర్డు సభ్యుల పదవీ కాలం రెండు సంవత్సరాలుగా నిర్ణయించారు. స్వయంప్రతిపత్తి కలిగిన టీటీడీ బోర్డు మాదిరిగా కాకుండా, యాదగిరిగుట్ట బోర్డు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటుంది. బోర్డుకు అవసరమైన బడ్జెట్‌ను కూడా ప్రభుత్వమే కేటాయిస్తుంది.
పెరుగుతున్న భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని యాదగిరిగుట్ట ఆలయ నిర్వహణ, పరిపాలన, అభివృద్ధిని సమర్థవంతంగా చూసుకోవడం ఈ బోర్డు ఏర్పాటు యొక్క ప్రధాన లక్ష్యం. ఆలయం పరిధిలోని విద్యా సంస్థలు, వేద పాఠశాలలు, గోశాల నిర్వహణను కూడా ఈ బోర్డు పర్యవేక్షిస్తుంది. యాదగిరిగుట్ట ఆలయం చుట్టూ ఉన్న 1,241 ఎకరాలను మూడు మున్సిపాలిటీలు, ఆరు గ్రామాలను కలుపుకొని "టెంపుల్ సిటీ"గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. వైటీడీ బోర్డు ఆధ్వర్యంలో వేద విద్యా సంస్థలను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.