|
|
by Suryaa Desk | Thu, Apr 24, 2025, 04:14 PM
పదేళ్ల పాలనలో ఉద్యమ నినాదాలను నిజం చేయడమే కాదు.. గ్రామస్వరాజ్యం కోసం జాతిపిత మహాత్ముడు కన్నకలల్ని కూడా సాకారం చేశారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు..ఇవాళ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం జరుపుకుంటున్న వేళ.. పల్లెసీమలే దేశానికి పట్టుగొమ్మలన్న... మహాత్మా గాంధీ ఆశయాలే స్ఫూర్తిగా బీఆర్ఎస్ పాలనలో ప్రాణంపోసిన ‘పల్లెప్రగతి’ని గుర్తుచేసుకోవాల్సిన సందర్భమిది. సమైక్యపాలనలో దశాబ్దాలపాటు దగాపడ్డ పల్లెలను.. దర్జాగా కాలర్ ఎగరేసుకునే స్థాయికి తీర్చిదిద్దిన సందర్భాలు అపూర్వం. అనితరసాధ్యం. సమస్యల సుడిగుండంలో విలవిలలాడిన ప్రతి పల్లె నాడు సకల సౌకర్యాల హరివిల్లైంది. కేసీఆర్ గారి సంకల్పంతో ప్రతి పల్లెసీమప్రగతిసీమగా మారింది.ప్రతి పల్లెలో డంప్ యార్డు తప్ప.. చెత్త కంపు లేని పరిస్థితి. కూలిపోయే స్థితి ఉన్న ఖాళీ ఇండ్ల కిరికిరి నుంచి పొంగిపొర్లే మురికికాలువల శుభ్రత వరకూ ప్రతి సమస్యకు పదేళ్ల పాలనలో శాశ్వత పరిష్కారం.
కలుషిత నీటి కలకలం లేకుండా, సీజనల్ రోగాల చింతలేకుండా సాగిన పంచాయతీల ప్రస్థానం గ్రామస్వరాజ్యంలో ఓ స్వర్ణయుగం. పచ్చదనానికి కొదవలేకుండా, నిధులకు కొరతలేకుండా, విధులకు ఆటంకం లేకుండా, ప్రతి ఊరును మెరుగైన జీవనానికి మారుపేరుగా మార్చింది మన కేసీఆర్ గారి విజన్. దేశంలో 3 శాతం జనాభా ఉన్న తెలంగాణ, పల్లెప్రగతిలో 30 శాతం అవార్డులను గెలుచుకోవడం పల్లె ప్రగతిలో భాగస్వాములైన ప్రతి ఒక్కరి విజయం. నాడు పదేళ్లపాటు మురిసిన పల్లె, కాంగ్రెస్ పాలనలో నేడు మళ్లీ కన్నీరు పెడుతోంది. కాంగ్రెస్ పాలనలో గ్రామస్వరాజ్యం పూర్తిగాగాడితప్పింది. ఏడాదిన్నర గడిచినా స్థానిక సంస్థలకు ఎన్నికలు లేవు. 15వ ఆర్థిక సంఘం నిధులు లేవు. గ్రామాల్లో కనీస వసతులు లేవు. పల్లెప్రజలకు గుక్కెడు మంచినీళ్లు దిక్కు లేవు.
చివరికి పంచాయతీ సిబ్బందికి వేతనాలు లేవు. ఉపాధి హామీ కూలీలకు పనిదినాలు లేవు. మాజీ సర్పంచ్ ల బిల్లులకే మోక్షం లేదు. దేశంలోనే ఆదర్శ గ్రామాలకు చిరునామాగా నిలిచిన తెలంగాణ పల్లెలు అధ్వాన పరిస్థితులకు అడ్రస్ గా మారడం అత్యంత బాధాకరం. ఢిల్లీ పార్టీలను నమ్మిన పాపానికి పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసిన తీరును తెలంగాణ పల్లె ప్రజలు గమనిస్తున్నారు.కేంద్రంలో అధికారంలో ఉండి తీవ్ర అన్యాయం చేస్తున్న బీజేపీకి, పచ్చని పల్లెలను సంక్షోభంలోకి నెట్టిన కాంగ్రెస్ పార్టీకి కర్రుగాల్చి వాతపెడ్తారు.