|
|
by Suryaa Desk | Fri, Apr 25, 2025, 06:17 AM
జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిన నేపథ్యంలో, మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఈ ఘాతుకాన్ని తీవ్రంగా ఖండిస్తూ, శుక్రవారం ప్రార్థనల సందర్భంగా ముస్లింలందరూ నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఉగ్రదాడి అంశంపై కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలోనూ ఆయన పాల్గొన్నారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఉగ్రవాదుల హేయమైన చర్యకు నిరసనగా రేపటి శుక్రవారం ప్రార్థనల్లో ముస్లింలు పాల్గొనాలని, ఆ సమయంలో నల్ల రిబ్బన్లు ధరించాలని అసదుద్దీన్ ఒవైసీ కోరారు. తమ నిరసనను శాంతియుతంగా తెలియజేయాలని సూచించారు.పాకిస్తాన్ అన్ని నిబంధనలను తుంగలో తొక్కిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం పాకిస్తాన్ మీద ఎలాంటి చర్యలు తీసుకున్నా సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.పహల్గాంలో జరిగిన దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొంటూ, ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఏ మతమూ ఇలాంటి దాడులను సమర్థించదని, శాంతికి ప్రతీక అయిన ఇస్లాం మతం కూడా హింసకు, దాడులకు వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు.పహల్గాం ఉగ్రదాడి ఘటనపై కేంద్ర ప్రభుత్వం గురువారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి వివిధ పార్టీల అగ్ర నేతలతో పాటు అసదుద్దీన్ ఒవైసీ కూడా హాజరయ్యారు. ఈ భేటీలో ఉగ్రదాడి అనంతరం తీసుకోవాల్సిన చర్యలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టే చర్యలకు తమ పార్టీ సంపూర్ణ సహకారం అందిస్తుందని ఈ సందర్భంగా ఒవైసీ తెలియజేశారు. దేశ భద్రత విషయంలో అందరూ కలిసికట్టుగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.