|
|
by Suryaa Desk | Sat, May 31, 2025, 06:31 PM
శరవేగంగా అభివృద్ధి చెందుతున్న పటాన్చెరు నియోజకవర్గంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు నూతన సబ్ స్టేషన్ల నిర్మాణాలు చేపడుతున్నామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.శుక్రవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని డిఈలు, ఏడిఈలతో విద్యుత్ సరఫరా, పంపిణీ అంశాల పైన ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేసవిలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్తును అందించామని తెలిపారు. ఇందుకు సహకరించిన అధికారులను ఆయన అభినందించారు. వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇనుప స్తంభాలు వెంటనే తొలగించి సిమెంట్ స్తంభాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యుత్ తీగలు వేలాడే పరిస్థితిలో ఉంటే నూతన తీగలు ఏర్పాటు చేయాలని కోరారు. విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా నూతనంగా రామచంద్రాపురం, అమీన్పూర్ గోశాల, చక్రపురి కాలనీల పరిధిలో 15 కోట్ల రూపాయలతో 33/11 కెవి సామర్థ్యంతో సబ్ స్టేషన్ల నిర్మాణం పూర్తి చేయడం జరిగిందని, అతి త్వరలో ప్రారంభించడం జరుగుతుందని తెలిపారు.
వీటితో పాటు పటాన్చెరు మండలం పోచారం, సింఫనీ కాలనీ, రామేశ్వరం బండ, గడ్డ పోతారం మున్సిపల్ పరిధిలోని మాదారం పరిధిలో 33/11 కెవి సబ్ స్టేషన్ల ఏర్పాటుకు టెండర్లు ఆహ్వానించడం జరిగిందని.. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. తెల్లాపూర్ పరిధిలో 33/11 కెవి సబ్స్టేషన్ నిర్మాణ దశలో ఉందని తెలిపారు.అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో భవిష్యత్తు అవసరాల కోసం. ఐలాపూర్ పరిధిలో 100 కోట్ల రూపాయలతో 220/33 కెవి సబ్ స్టేషన్ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించడం జరిగిందని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టులో భాగంగా రామచంద్రపురం, భారతీ నగర్, పటాన్చెరు డివిజన్లో పరిధిలో అండర్ గ్రౌండ్ కేబుల్ ఏర్పాటు కోసం సర్వే నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుందని తెలిపారు.ఈ సమావేశంలో డి ఈ భాస్కరరావు, ఏ డి ఈ లు సంజీవ్, దుర్గా ప్రసాద్, తులసి రామ్, తదితరులు పాల్గొన్నారు.