|
|
by Suryaa Desk | Sun, Jun 01, 2025, 02:58 PM
వర్షాకాలం ప్రారంభం అయ్యింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాలు నీట మునుగుతున్నాయి. మురుగు, వరద నీరు రహదారులను ముంచెత్తి ట్రాఫిక్ అంతరాయాలకు కారణమౌతోంది. ఈ సమస్యలపై హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) దృష్టి పెట్టింది. ఇప్పటికే చెరువుల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్న హైడ్రా.. వర్షాకాలం కావడంతో నాలాల ఆక్రమణలపై ప్రధానంగా దృష్టి పెట్టింది. నాలాల ఆక్రమణలు, ఇబ్బందులపై ప్రజావాణిలో ఫిర్యాదులను స్వీకరించాలని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు సూచించారు. జూన్ నెలతో పాటు.. అవసరమైతే జులై నెలలో కూడా నాలాల సమస్యలపైనే ఫిర్యాదులు స్వీకరించి.. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఓఆర్ ఆర్ పరిధిలో నాలాల కబ్జాలకు సంబంధించి ఎలాంటి సమస్య ఉన్నా.. తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. నాలా ఆక్రమణకు గురైనట్టు రుజువు చేసే చిత్రాలు పాతవి, ప్రస్తుతానివి కూడా తీసుకువచ్చి ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తే ఉపయుక్తంగా ఉంటుందని సూచించారు.