|
|
by Suryaa Desk | Mon, Jun 02, 2025, 03:23 PM
మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా తూముకుంట మున్సిపాలిటీలోని తూముకుంట గ్రామంలో పార్కును కబ్జాల చెర నుంచి హైడ్రా కాపాడింది. దాదాపు 2 వేల గజాల విస్తీర్ణంలో ఉన్న పార్కును ఆ పక్కనే స్థలం ఉన్న వ్యక్తి కబ్జా చేశారంటూ నార్త్ పార్కు అవెన్యూ వెంచర్ ప్రతినిధులు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో హైడ్రా ఈ మేరకు చర్యలు తీసుకుంది. 97, 108, 109 సర్వే నంబర్లలోని మూడున్నర ఎకరాలలో 10 ప్లాట్లతో 1997లో నార్త్ పార్క్ అవెన్యూ వెంచర్‌ను వేశారు. ఇందులో 2 వేల గజాల మేర పార్కుకు కేటాయించారు. ఈ పార్కు 27 సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఆ పార్కు స్థలం తనదంటూ.. గతంలో ఉన్న ఈత కొలనుతో పాటు.. పార్కు ప్రహరీని కబ్జాదారుడు కూల్చేశాడని నివాసితులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. అప్పటి లే ఔట్ ప్రకారం .. అది పార్కు స్థలమే అని స్థానిక మున్సిపల్ అధికారులతో నిర్ధారించుకున్నాక హైడ్రా ఆక్రమణలను తొలగించింది. అందులో నిర్మించిన షెడ్డుతో పాటు.. చుట్టూ కబ్జాదారుడు ఏర్పాటు చేసిన ప్రహరీని కూడా తొలగించింది. పార్కు స్థలం లభించడంతో ప్లాట్ ఓనర్లు హర్షం వ్యక్తం చేశారు.