|
|
by Suryaa Desk | Thu, Jan 22, 2026, 07:48 PM
హైడ్రా ఒకే రోజు రెండు చోట్ల ఆక్రమణలను తొలగించింది. గచ్చబౌలి ప్రాంతంలో పార్కును కాపాడగా.. శామీర్‌పేటలో రోడ్డు ఆక్రమణలను తొలగించి అక్కడి నివాసితులకు దారి చూపింది. ఈ రెండు ఆక్రమణల తొలగింపునకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గచ్చిబౌలి టెలికాంనగర్ పేరిట బీఎస్ ఎన్ ఎల్ ఉద్యోగులు 1982లో 32 ఎకరాల పరిధిలో అప్పటి హుడా అనుమతితో లే ఔట్ వేశారు. ఇందులో 4వేల గజాలు పార్కుకోసం కేటాయించారు. ఇందులో 1500ల గజాల వరకూ ఆక్రమణలు జరిగిపోయాయి. నివాసాలు కూడా వచ్చాయి. మిగిలిన 2500ల గజాల స్థలంలో కూడా ప్లాట్లున్నాయంటూ కొంతమంది ఆక్రమణలకు పాల్పడ్డారు. దీంతో టెలికామ్ నగర్ నివాసితులు హైడ్రాను ఆశ్రయించారు. హైడ్రా ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారి ఆదేశాల మేరకు రెవెన్యూ, జీహెచ్ ఎంసీ అధికారులతో కలసి హైడ్రా క్షేత్ర స్థాయిలో పరిశీలించింది. 4 వేల గజాలు పార్కుకు కేటాయించినట్టు నిర్ధారణ అయ్యింది. ఇందులో ఇప్పటికే నివాసాలు రాగా.. వాటిని మినహాయించి మిగిలిన 2500ల గజాల పార్కు స్థలంలో ఆక్రమణలు తొలగించి.. పార్కు స్థలంగా పేర్కొంటూ హైడ్రా బోర్డులు ఏర్పాటు చేసింది. భవిష్యత్తులో ఆక్రమణలకు ఆస్కారం లేకుండా హైడ్రా ఫెన్సింగ్ వేసింది.