|
|
by Suryaa Desk | Sat, Mar 07, 2026, 06:20 PM
తెలంగాణలో బీఫార్మసీకి గరిష్ఠంగా రూ.1.21 లక్షలు, ఫార్మా డీ కోర్సులకు అయితే రూ.1,37,500, బీఆర్క్ విద్యకు అయితే రూ.1.32 లక్షలుగా అకాడమిక్ ఫీజు నిర్ణయించారు. ఈ మేరకు మూడు కోర్సులకు ఫీజులను ఖరారుచేస్తూ తాజాగా.. సర్కార్ జీవో జారీ చేసింది. తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (TAFRC) పంపిన సిఫార్సులను ఆమోదిస్తూ రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. బీఫార్మసీలో గత ఫీజులతో పోల్చితే 10-15 శాతం పెరిగాయి. గతంలో మూడు కాలేజీల్లో మాత్రమే రూ.లక్ష ఫీజు ఉండేది. ఈసారి ఆ కాలేజీల సంఖ్య ఆరుకు చేరింది. రాష్ట్రంలో 120 బీఫార్మసీ కాలేజీలు ఉండగా.. 103 కాలేజీల్లో ఫీజు రూ.50 వేలపైనే ఉంది. మరో 17 కాలేజీల్లో మాత్రమే రూ.45 వేల నుంచి రూ.49,500 మధ్య ఉండటం విశేషం.
ఫార్మా డీలో గతంలో గరిష్ఠంగా రూ.1.25 లక్షల ఫీజు ఉండగా.. ఈసారి రూ.1,37,500కి పెరిగింది. తెలంగాణ వ్యాప్తంగా 79 ఫార్మా డీ కాలేజీలు ఉండగా ఆ కోర్సుకు కనిష్ఠ ఫీజు రూ.68 వేలుగా నిర్ణయించారు. మొత్తం 13 ఫార్మా డీ కళాశాలల్లో ఫీజు రూ.లక్ష, ఆపైగా డిసైడ్ చేశారు. బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కాలేజీలు మెుత్తం 8 ఉండగా.. అందులో అశోకా కళాశాలలో మాత్రమే ఫీజును రూ.1.32 లక్షలుగా నిర్ణయించారు. లక్ష ఫీజు దాటిన కాలేజీలు ఓసారి చూసినట్లయితే.. గురునానక్ టెక్నికల్ క్యాంపస్ 1.21 లక్షలు, CMR 1.10 లక్షలు , విష్ణు ఇన్‌స్టిట్యూట్ 1,06,400, సుల్తాన్ ఉలూమ్ 1,05,800, పుల్లారెడ్డి కాలేజ్ 1,02,600, గీతాంజలి కాలేజ్ 1,00,800, ఎస్.ఎన్.వనితా మహావిద్యాలయ రూ.లక్షగా ఫీజును నిర్ణయించారు.
ఫార్మా డీలో గీతాంజలి కాలేజీ 1,37,500, గురు నానక్ క్యాంపస్ 1,37,500, శ్రీదత్త కాలేజీ 1,26,500, శ్రీ ఇందు ఆర్వీఆర్ 1.10 లక్షలు, సెయింట్ పీటర్స్ 1.10 లక్షలు, సుల్తాన్ ఉలూమ్ 1.10 లక్షలు, మల్లారెడ్డి కాలేజీ 1.10 లక్షలు, ఎస్.ఎన్. వనితా మహావిద్యాలయ 1.08 లక్షలుగా, తాళ్ల పద్మావతి 1.08 లక్షలు, భరత్ 1.07 లక్షలు, మల్లారెడ్డి ఫార్మసీ 1,02,600, సీఎంఆర్ లక్షగా ఫీజులను నిర్ణయించారు.