|
|
by Suryaa Desk | Sat, Mar 07, 2026, 06:27 PM
ప్రస్తుత సమాజంలో యువత చెడు వ్యసనాల వైపు మళ్లుతున్న తీరు, దాని వల్ల జరుగుతున్న ప్రాణ నష్టంపై కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి మాట్లాడిన మాటలు కనువిప్పులా మారాయి. మద్యం మత్తులో యాక్సిడెంట్‌కు గురై ప్రాణాలు కోల్పోయిన ఓ యువకుడి అంతిమయాత్రలో ఆయన మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వటమే కాదు లక్షలాది మందిని ఆలోచింపజేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. హనుమకొండ జిల్లా కాజీపేట పరిధిలో ఒక యువకుడు మద్యం మత్తులో రోడ్డు ప్రమాదానికి గురై మరణించగా.. అతని అంతిమయాత్రలో పాల్గొన్న ఏసీపీ ప్రశాంత్ రెడ్డి చేసిన ప్రసంగం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. సాధారణంగా ఖాకీ దుస్తుల్లో కఠినంగా కనిపించే ఒక పోలీస్ అధికారి.. ఒక తండ్రిలా, ఒక అన్నలా మారి ఆవేదనతో చేసిన హితబోధ అక్కడున్న వారి కళ్లను చెమర్చింది.
నేటి యువతలో చాలామంది గంజాయి, మద్యం వంటి వ్యసనాలకు బానిసలుగా మారుతున్నారని ఏసీపీ ఆందోళన వ్యక్తం చేశారు. 'క్షణకాలపు మత్తు కోసం జీవితాలను పణంగా పెడుతున్నారు. గంజాయి సేవించి, మద్యం మత్తులో అతివేగంగా వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. మీరు చనిపోతే నష్టపోయేది కేవలం మీ కుటుంబమే. మీ తల్లిదండ్రుల కన్నీళ్లకు సమాధానం ఎవరు చెబుతారు? వాళ్లు కూలీకి వెళ్లి కష్టపడి మిమ్మల్ని పెంచి పోషిస్తే మీరు చెడు వ్యసనాలకు బానిసలై యుక్త వయసులోనే చనిపోతున్నారు. నిన్ను అభివృద్ధి పథంలో నడిపించేవాడే నిజమైన స్నేహితుడు. మద్యం తాగమని, గంజాయి పీల్చమని ప్రేరేపించేవాడు స్నేహితుడు కాదు, వాడు నీ జీవితాన్ని నాశనం చేసే శత్రువు. అలాంటి చెడు స్నేహాలను వెంటనే వదులుకోండి. పుట్టినా.. సచ్చినా.. పార్టీల్లో గెలిచినా.. ఓడినా.. అన్నింటికీ తాగుడే అన్నట్లు తయారయ్యారు. చనిపోయిన మీ దోస్త్ శవాన్ని చూసైనా మీలో మార్పు రావాలి" అంటూ పిలుపునిచ్చారు.
ప్రతి ఒక్కరి జీవితం ఎంతో విలువైనదని, పేదరికాన్ని జయించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలే తప్ప ఇలా అర్థాంతరంగా తనువు చాలించకూడదని ఆయన హితవు పలికారు. 'మీ తల్లిదండ్రులు ఎన్నో ఆశలతో మిమ్మల్ని పెంచారు. వారి కష్టాన్ని గుర్తించండి. జీవితం ఒక్కటే.. అది మళ్ళీ రాదు. క్రమశిక్షణతో బతకండి. అని ఆవేదనతో కూడిన సందేశాన్ని ఇచ్చారు. ఏసీపీ ప్రశాంత్ రెడ్డి మాట్లాడిన మాటల వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఒక పోలీస్ అధికారిగా శాంతిభద్రతలను కాపాడటమే కాకుండా.. సమాజం పట్ల బాధ్యతతో ఆయన చేసిన ఈ ప్రయత్నాన్ని నెటిజన్లు కొనియాడుతున్నారు. ప్రతి పోలీస్ అధికారి ఇలాగే స్పందిస్తే యువతలో మార్పు రావడం ఖాయమని కామెంట్స్ పెడుతున్నారు.