by Suryaa Desk | Sat, Aug 10, 2024, 09:36 PM
ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల వరకు రైతుల రుణమాఫీ చేస్తామని ఉప-ముఖ్యమంత్రి, ఆర్ధిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. ఆగస్టు 15లోగా రైతులకు రుణమాఫీ తీరుతామన్న ముఖ్యమంత్రి ఎనముల రేవంత్‌రెడ్డి చేసిన సవాల్‌ను నిరూపించుకోనున్నామని ఆయన అన్నారు. వైరా వేదికగానే రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. శుక్రవారం తన సొంత జిల్లా ఖమ్మంలో పర్యటించిన డిప్యూటీ సీఎం.. పలు అభివృద్ధి పనులకు శుంకుస్థాపన చేశారు. వైరా మున్సిపాల్టీతో పాటు ఆయన స్వగ్రామం స్నానాల లక్ష్మీపురంలో సుమారు రూ. 100 కోట్ల విలువైన పనులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ..స్వాతంత్య్ర దినోత్సవం రోజున సీతారామ పంప్‌హౌస్‌లను ప్రారంభిస్తామని తెలిపారు. అనంతరం వైరాలో పండుగలా బహిరంగ సభను నిర్వహించి ఆ వేదికపై నుంచే రూ.2 లక్షల వరకు రుణాలున్న రైతుల ఖాతాల్లోకి నిధులు జమచేయనున్నట్టు ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఎన్నికల్లో హామీ మేరకు రైతు రుణమాఫీ పూర్తిచేస్తున్నామని పేర్కొన్నారు. రుణమాఫీపై జులై 15 న జీవో జారీచేసి .. తొలి విడతగా జులై 18న ఒక లక్ష రూపాయల రుణమాఫీ కోసం 6,983 కోట్లు విడుదల చేశామని తెలిపారు. రెండో విడతలో రూ.6190.02 కోట్లతో నెలాఖరున మళ్లీ విడుదల చేసి లక్షన్నర వరకు రుణాలను మాఫీ చేశామని చెప్పారు.
ఇందిరమ్మ రాజ్యంలో నిబద్ధతతో పని చేస్తున్నామని డిప్యూటీ సీఎం ఉద్ఘాటించారు. ఆగస్ట్ 15న వైరాలో నిర్వహించే భారీ రైతు బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రివర్గం, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున పాల్గొంటారని పేర్కొన్నారు. రైతుల రుణమాఫీ చేయడం తమ అదృష్టంగా భావిస్తున్నామని వ్యాఖ్యానించారు. సీఎం ఛాలెంజ్ చేశారని.... కాంగ్రెస్ ఇచ్చిన మాటను నిలబెట్టడం కోసం వైరా సభలో రైతులు పండుగ లాగా పాల్గొని మన రైతాంగ సోదరులు మంచి సందేశం ఇచ్చేలా సభ జరుపుతామని చెప్పారు.
కేవలం రుణమాఫీయే కాదు రైతు బీమాకి సంబంధించి రూ.1000 చొప్పున రూ 500 కోట్లు రైతుల తరుపున ప్రభుత్వం చెల్లిస్తుందని భట్టి తెలిపారు. క్రాఫ్ట్ ఇన్సూరెన్స్ కూడా చేస్తున్నామని, రైతులు కట్టాల్సిన రూ.1,350 కోట్లు తామే కడుతున్నామనిఆయన వెల్లడించారు. ‘గతంలో ఎన్నడూలేని విధంగా వ్యవసాయ అనుబంధ రంగాలకు బడ్జెట్‌లో రూ.72 వేల కోట్లు కేటాయించాం.. మా ప్రభుత్వం కేవలం రూ.75 కోట్లు ఖర్చుతో రాజీవ్ లింకు కెనాల్‌ను నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువకు అనుసంధానం చేసి అక్కడి నుంచి వైరా జలాశయానికి గోదావరి జలాలను 3 నెలల్లోనే తీసుకొస్తుంది’ భట్టి అన్నారు.