by Suryaa Desk | Tue, Nov 12, 2024, 03:28 PM
దేశానికి స్వాతంత్ర్యo అందించడంలో కీలకపాత్ర పోషించి దూరదృష్టితో విద్యా వ్యవస్థలో సంస్కరణలు తెచ్చిన మహనీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని.. వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. మైనారిటీల సంక్షేమ దినోత్సవం, జాతీయ విద్యా దినోత్సవం పురస్కరించుకొని సోమవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అబుల్ కలాం జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటానికి కలెక్టర్ పామేలా సత్పతి , మేయర్ సునీల్ రావు, సుడా చైర్మన్ కోమటి రెడ్డి నరేందర్ రెడ్డి అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ..
అబుల్ కలాం ఎప్పుడు కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ఉండేలా పోరాడారని పేర్కొన్నారు. తన జీవితాన్ని దేశానికి స్వాతంత్రం, విద్యాశాఖలో సంస్కరణలు తెచ్చేందుకు అంకితం చేశారన్నారు. రచయితగా, కవిగా, తత్వవేత్తగా, విద్యావేత్తగా అనేక సేవలందించారని.. వారి సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం భారతరత్నకు ఎంపిక చేసిందన్నారు. మనం కూడా వారిలాగా నిరంతరం నేర్చుకుంటూ సమాజాభివృద్ధికి పాటుపడాలన్నారు.
మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ భారతరత్న కలాం భారతదేశ తొలి విద్యామంత్రిగా పనిచేస్తూ ఆయన రూపొందించిన విద్యావిధానం దేశాభివృద్ధికి ఎంతో తోడ్పడిందని చెప్పారు. సమైక్యతా వాది ఆజాద్ దేశ విభజనను తీవ్రంగా వ్యతిరేకించారని, మతసామరస్యాన్ని ఆచరించి చూపించారని కొనియాడారు.సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ.. మహనీయుల త్యాగాలను భావితరాలకు చెప్పాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అబుల్ కలాం అరబిక్, హిందీ, ఉర్దూ బెంగాలీ, ఇంగ్లీష్ , ఫ్రెంచ్ భాషల్లో ప్రావీణ్యం సంపాదించాడన్నారు. అంతకుముందు మైనారిటీల అభివృద్ధికి వారు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి పవన్ కుమార్,డీఆర్ఓ బీ వెంకటేశ్వర్లు, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అనిల్, డీవైఎస్ వో శ్రీనివాస్, మైనారిటీ అసోసియేషన్ ప్రతినిధులు, పలువురు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.