by Suryaa Desk | Sat, Aug 10, 2024, 09:40 PM
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో.. తెలంగాణలోని మహబూబ్‌నగర్ జిల్లాలో అమర రాజా బ్యాటరీ ప్లాంట్‌కు శంకుస్థాపన జరిగిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఈ ప్లాంట్ విషయంపై అమరరాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ ఛైర్మన్ గల్లా జయదేవ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. గత ప్రభుత్వం హయాంలో బ్యాటరీ ప్లాంట్ కోసం ఇచ్చిన హామీలను ఇప్పుడున్న ప్రభుత్వం నెరవేర్చకపోతే తమ ప్లాంట్ కోసం వేరే చోటు చూసుకుంటామంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం (ఆగస్టు 10న) రోజున మహబూబ్‌నగర్ జిల్లాలో సెల్ మాన్యుఫాక్చరింగ్ కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంటు నిర్మాణానికి భూమి పూజ చేసిన గల్లా జయదేవ్.. 1.5 గిగావాట్ల బ్యాటరీ ప్యాక్ ప్లాంట్ ఫేజ్-1కు ప్రారంభోత్సవం చేశారు.
అయితే.. అమరరాజా కంపెనీ తెలంగాణలో లిథియం- అయాన్ బ్యాటరీ తయారీకి సంబంధించి రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, గ్రీన్‌ఫీల్డ్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి 10 ఏళ్లలో 9,500 కోట్ల పెట్టుబడి కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ఈ ప్లాంట్ ఏర్పాటుకు గత ప్రభుత్వం పారిశ్రామిక ప్రోత్సాహకాల విషయంలో కొన్ని హామీలను ఇచ్చిందని.. ప్రస్తుత ప్రభుత్వం వాటిని నెరవేరుస్తారనే ఆశతో ఉన్నామని గల్లా తెలిపారు. ఒకవేళ ప్రస్తుత సర్కారు.. గత ప్రభుత్వ హామీలను విస్మరిస్తే అమర రాజా ప్లాంట్ వేరే చోటుకి వెళ్లే అవకాశముందని గల్లా జయదేవ్ హెచ్చరిక చేశారు. అలాంటి పక్షంలో ప్లాంటు కెపాసిటీ విస్తరణను మరొక చోటుకు తరలించడం తప్ప తమకు మరో మార్గం లేదన్నారు.
"మా సందేహం ఏంటంటే.. తెలంగాణలో కొత్త ప్రభుత్వం వచ్చింది. వారు ఏం చేస్తారో తెలియదు. ఆశాభావంతో ఉన్నాం కానీ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చూస్తే.. గత ప్రభుత్వ కమిట్‌మెంట్లను నెరవేరుస్తారా? లేదా? అన్న సందేహాలు వస్తున్నాయి. కమిట్‌మెంట్‌లను నెరవేర్చేందుకు వారి వద్ద నిధులు, వనరులు ఉన్నాయా? అని అనుమానం వస్తుంది. ప్రస్తుత ప్రభుత్వంతో మాకేమీ ఇబ్బందులు లేవు. ఇబ్బందులు ఎదురవుతాయని అనుకోవడం లేదు కానీ.. భారతదేశంలో పరిణామాలు ఎలా మారిపోతుంటాయో చూస్తున్నదే కదా. ప్రభుత్వాలు మారిపోతే గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే పరిస్థితులు లేవు. ఆశాభావంతో ఎదురుచూస్తున్నాం. పరిస్థితులు సానుకూలంగా ఉన్నంత వరకూ ప్లాంటు విస్తరణ వేరొక చోటికి తరలించాల్సిన పరిస్థితి రాదు." అంటూ గల్లా జయదేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు తెలంగాణకు భారీ స్థాయిలో పెట్టుబడులు తెచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి బృందం అమెరికాలో పర్యటిస్తున్న నేపథ్యంలో గల్లా జయదేవ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయటం సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.