by Suryaa Desk | Tue, Nov 12, 2024, 03:22 PM
జోగిపేటలో కళాశాల, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు సకాలంలో బస్సులు లేకపోవడం వల్ల ఇబ్బందులకు గురువుతున్నందుకుగాను సోమవారం జోగిపేట బస్టాండ్ వద్ద ప్రధాన రహదారిపై ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు రాస్తారోకో చేపట్టారు. ఆర్టీసీ అధికారుల నిర్లక్ష్యంపై నినాదాలు చేశారు. ప్రధాన రహదారిపై బైఠాయించడంతో ఇరువైపులా వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి.
ఈ సందర్భంగా ఏబీవీపీ నగర కార్యదర్శి రజనీకాంత్ మాట్లాడుతూ నారాయణఖేడ్ డిపో నుంచి జగిర్యాల మీదుగా జోగిపేటకు ఆర్టీసీ బస్సు ఉదయం సాయంత్రం నడపాలని గత కొన్ని నెలలుగా నారాయణఖేడ్ డిపో మేనేజర్ దృష్టికి సమస్యలు తీసుకువెళ్లినా పట్టించుకోకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారన్నారు. బస్సులు లేకపోవడంతో అటువైపు నుంచి వచ్చే విద్యార్థులు సమయానికి కళాశాలలకు రాలేకపోతున్నారని, ఆర్టీసీ బస్సుల సమస్యలను పరిష్కరించనట్లయితే ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. జోగిపేట సీఐ అనిల్ కుమార్ విద్యార్థులకు నచ్చజెప్పి రాస్తారోకోను విరమింప చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మధుసూదన్, సాయి కిరణ్, మహేష్, అజయ్, శివాజీ తదితరులు పాల్గొన్నారు.