![]() |
![]() |
by Suryaa Desk | Wed, Mar 12, 2025, 11:00 AM
ఓల్డ్ బాంబే హైవేలోని ముఘల్ రెస్టారెంట్ వద్ద 1500 ఎంఎం డయా పీఎస్సీ పంపింగ్ మెయిన్ కు మరమ్మతులు పూర్తయ్యాయి. జలమండలి అధికారులు నిరంతరాయంగా పనిచేసి ఈ రోజు అర్ధరాత్రి సమయంలో మరమ్మతులు పూర్తి చేశారు. తెల్లవారుజామున ఆయా రిజర్వాయర్లలోకి నీటి సరఫరా జరగ్గా.. ఉదయం నుంచి మొదటగా ఆన్ లైన్ సప్లై చేశారు. తర్వాత డిస్ట్రిబ్యూషన్ రిజర్వాయర్లకు సరఫరా పునరుద్ధరించారు. ఈ నేపథ్యంలో ఎండీ అశోక్ రెడ్డి హైదర్ నగర్ రిజర్వాయర్ ను సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. షట్ డౌన్ వల్ల నీటి సరఫరా నిలిచి పోయిన ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేశామని.. భారీ పైపు కావడం, 30 ఏళ్ల క్రితం నాటి పైపు కాబట్టి పనులు కాస్త ఆలస్యం అయ్యాయన్నారు. అయినా జలమండలి టెక్నికల్ టీమ్ సలహాలు, సూచనలతో వెల్డింగ్ సంబంధించిన యంత్రాలు, పనిముట్లు, నిర్మాణ సామగ్రిని అప్పటికే సమకూర్చుకుని పనులు పూర్తి చేశామని పేర్కొన్నారు. పనులు చేసి నీటి సరఫరాను పునరుద్ధరించిన ట్రాన్స్ మిషన్ అధికారులు, సిబ్బందిని ఎండీ ప్రశంసించారు. లీకేజీ వల్ల ప్రభావితమైన వాటిల్లో ఇంకా ఏ ప్రాంతానికైనా నీటి సరఫరా జరగకపోతే ట్యాంకర్ల ద్వారా సప్లై చేయాలని సూచించారు.
అనంతరం రిజర్వాయర్ ప్రాంగణంలోని క్వాలిటీ అస్యూరెన్స్ వింగ్ (క్యూఏటీ) ల్యాబ్ ను సందర్శించారు. అక్కడి సిబ్బందితో మాట్లాడి నీటి నాణ్యత పరీక్ష వివరాలు అడిగి తెలుసుకున్నారు. టెస్టింగ్ విధానాల్లో టెక్నాలజీని వాడుకోవాలన్న ఆయన.. టెస్టుల ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించుకోవాలని సూచించారు. అప్ గ్రేడ్ చేయడానికి కావాల్సిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. తర్వాత అక్కడే ఉన్న స్టాఫ్ కాలేజ్ బిల్డింగ్, ట్రైనింగ్ సెంటర్, లైబ్రరీ, క్లాస్ రూములను పరిశీలించారు. అవసరమైన భవనాలకు రిపర్లే చేయాలన్నారు. తర్వాత ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్ ను ఎండీ సందర్శించారు. బుకింగ్, పెండెన్సీ సరళిని అడిగి తెలుసుకున్నారు. లీకేజీ ఘటన వల్ల ఈ ప్రాంతంలో 265 ట్రిప్పులు పెండింగ్ లో ఉన్నాయని అధికారులు ఎండీకి తెలుపగా.. వాటిని 12 గంటల్లో క్లియర్ చేయాలని ఆదేశించారు. అవసరమైతే అదనపు సిబ్బందితో రెండు షిఫ్టుల్లోనూ పనిచేయాలని సూచించారు. ఫిల్లింగ్ పాయింట్ వద్ద నీరు వృథాగా పోతుంటే.. అవి ఇంకుడు గుంతల్లోకి పంపేలా ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఫిల్లింగ్ పాయింట్ల వద్ద సీసీ ఫ్లోరింగ్ చేయాలని, ప్రత్యేకమైన నిచ్చెన లాంటి ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈఎన్సీ, డైరెక్టర్ ఆపరేషన్స్-2 వీఎల్.ప్రవీణ్ కుమార్, టెక్నికల్ డైరెక్టర్ సుదర్శన్, సీజీఎంలు రవీందర్ రెడ్డి, నారాయణ, జీఎంలు, ఓ అండ్ ఎం, ట్రాన్స్ మిషన్ అధికారులు పాల్గొన్నారు.