![]() |
![]() |
by Suryaa Desk | Sat, Mar 15, 2025, 03:34 PM
సోషల్ మీడియాలో తన కుటుంబ సభ్యుల పట్ల దారుణమైన రీతిలో పోస్టులు పెడుతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ధ్వజమెత్తారు. పెయిడ్ ఆర్టిస్టులతో మాట్లాడించి విమర్శిస్తున్నారని బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. జర్నలిస్టుల ముసుగులో అసాంఘిక భాష వాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఆడబిడ్డల గురించి అసభ్యంగా పోస్టులు పెట్టేవాళ్లు జర్నలిస్టులా అని ప్రశ్నించారు. హద్దులు దాటి నోరు జారితే ఫలితం మరోలా ఉంటుందని స్పష్టం చేశారు. జర్నలిస్టులకు విధి విధానాలు నిర్ణయిస్తామని అన్నారు. "ఐ అండ్ పీఆర్ లేదా డీఏవీపీ ఆమోదించిన పత్రికలు, ప్రసార సాధనాల వాళ్లు ఇచ్చిన ఐడీ కార్డులు ఉన్నవాళ్లు జర్నలిస్టులా, లేక, ఎవడు పడితే వాడు ఏదో ఒక టీవీ, యూట్యూబ్ చానల్ పెట్టుకుని నోటికొచ్చినట్టు మాట్లాడేవాళ్లు జర్నలిస్టులా? మమ్మల్ని ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి ఓపిక పడుతున్నాం ఆ భాష వింటుంటే రక్తం మరుగుతోంది.కుటుంబ సభ్యులను అంతేసి మాటలు అంటుంటే మీరసలు మనుషులే అని వాళ్లను అడుగుతున్నా. మీకు భార్యాబిడ్డలు లేరా తల్లిదండ్రులు లేరా ట్విట్టర్ లో తప్పుడు వ్యాఖ్యలతో పోస్టులు పెడుతున్న వాళ్లను అరెస్ట్ చేస్తే, ఆ అరెస్టులను ఖండిస్తున్నారు.మీ అమ్మనో, మీ భార్యనో, మీ చెల్లినో ఈ రకంగా మాట్లాడితే నువ్వు వింటావా అని ఆ అరెస్టులను ఖండించే వారిని ప్రశ్నిస్తున్నా. నా భార్యను, నా బిడ్డను మాట్లాడుతుంటే నాకు నొప్పి కలుగుతుంది కానీ ఓ ఆడపిల్లను అవమానిస్తుంటే నీకు నొప్పి కలగదా? ఏ సంస్కృతిలో ఉన్నావు నువ్వు ముఖ్యమంత్రిగా చెబుతున్నా తోలు తీస్తా ఒక్కొక్కడికీ బట్టలు విప్పదీసి రోడ్డు మీది తిప్పిస్తా రాజకీయాల్లో ఉన్నది నేను నా గురించి మాట్లాడండి, విమర్శించండి, విశ్లేషించండి.ఇంట్లో ఉన్న ఆడవాళ్లను గురించి మాట్లాడే సంస్కృతి ఎక్కడ్నించి వచ్చింది ఈ విధంగా తెలంగాణ సంస్కృతిని విషపూరితం చేస్తున్నారు.నోటికొచ్చింది మాట్లాడి వాటిని పోస్టులుగా పెట్టించి పైశాచిక ఆనందం పొందుతున్నారు. వాళ్లు తిట్టిన తిట్లకు అక్కడ నా పేరు తీసేసి మీ పేరు రాసుకోండి. మీకు అన్నం తినబుద్ధి అవుతుందేమో చూస్తా.తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే అంత బలహీనుడు అనుకుంటున్నారా ఇన్నాళ్లు ఓపిక పట్టాను కాబట్టి సరిపోయింది మీకెంతమంది ఉన్నారో తెలియదు నాకు చికాకు కలిగిందని తెలిస్తే లక్షలాది మంది పిల్లలు రోడ్డు మీదికి వచ్చి ఒక్కొక్కరిని బట్టలిప్పదీసి కొడతారు. నేను వద్దంటున్నాను కాబట్టి వారు ఆగుతున్నారు. చట్టాల పట్ల, శాసనాల పట్ల, భారత రాజ్యాంగం పట్ల సంపూర్ణ విశ్వాసం ఉంది కాబట్టి సంయమనం పాటిస్తున్నా అంతే తప్ప మాకు చేతకాక కాదు. చంద్రశేఖర్ రావు గారూ మీ పిల్లలకు చెప్పు ఇది మంచిది కాదు ఇలా ఏదో చేసి మానసికంగా కుంగదీసి, దెబ్బతీసి రాజకీయంగా ప్రయోజనం పొందుదామని అనుకుంటున్నావేమో అలా అని కలలు కంటున్నావేమో ఇక కుదరదు చంద్రశేఖర్ రావ్ హద్దు దాటినా, మాట జారినా దాని ఫలితం అనుభవిస్తారు" అంటూ రేవంత్ రెడ్డి ఘాటుగా వార్నింగ్ ఇచ్చారు.