![]() |
![]() |
by Suryaa Desk | Wed, Mar 19, 2025, 05:43 PM
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి పూర్తి స్థాయి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. మొత్తం రూ.3,04,965 కోట్లతో రూపొందించిన ఈ బడ్జెట్‌లో రైతు సంక్షేమం, ఉచిత విద్యుత్, గృహజ్యోతి, గ్యాస్ సిలిండర్ వంటి సంక్షేమ పథకాలకు భారీగా నిధులు కేటాయించారు. మొత్తం బడ్జెట్ – ₹3,04,965 కోట్లు, రెవెన్యూ వ్యయం – ₹2,26,982 కోట్లు, మూలధన వ్యయం – ₹36,504 కోట్లుగా పేర్కొన్నారు.ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్‌ను ముందుగా కేబినెట్‌కు సమర్పించగా, మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అనంతరం 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు బడ్జెట్‌లో భారీగా రూ.56,084 కోట్లు కేటాయించింది. ఈ పథకాల ద్వారా ప్రజలకు నేరుగా ఆర్థిక లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ పథకాలు ప్రత్యేకంగా పేద, మధ్యతరగతి ప్రజలను లక్ష్యంగా పెట్టుకుని రూపొందించారని తెలిపారు.రైతు భరోసా – ₹18,000 కోట్లు, చేయూత పింఛన్లు – ₹14,861 కోట్లు, ఇందిరమ్మ ఇళ్లు – ₹12,571 కోట్లు, గృహజ్యోతి (200 యూనిట్ల ఉచిత విద్యుత్) – ₹2,080 కోట్లు, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ – ₹723 కోట్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా – ₹600 కోట్లు, విద్యుత్ రాయితీ – ₹11,500 కోట్లు, రాజీవ్ యువ వికాసం – ₹6,000 కోట్లు, మహాలక్ష్మి పథకం (ఉచిత బస్సు సహా) – ₹4,305 కోట్లు కేటాయించారు. ఈ పథకాల అమలుతో పేద, మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక భారం తగ్గుతుందని ప్రభుత్వం వెల్లడించింది.