![]() |
![]() |
by Suryaa Desk | Wed, Mar 19, 2025, 06:15 PM
హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన మౌలిక సదుపాయలు కల్పిస్తోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త ఫ్లైఓవర్లు, అండర్‌పాసులు నిర్మించగా.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాటిని కొనసాగిస్తోంది. తాజాగా బడ్జెట్ ప్రసంగంలో నగరంలో కల్పించాల్సిన మౌళిక వసతులపై ఆర్థిక మంత్రి భట్టి విక్కమార్క కీలక ప్రకటన చేశారు.
నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు హైటెక్ సీటీ ప్రణాళిక అమలుచేస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా 31 ఫ్లైఓవర్లు, 17 అండర్‌పాసులు, 10 చోట్ల రోడ్డు విస్తరణ పనులను చేపట్టినట్లు చెప్పారు. మెుత్తం 7,032 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించినట్లు వెల్లడించారు. రూ.150 కోట్లతో సుందరీకరణ పనులను కూడా చేపట్టినట్లు స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో ట్రాఫిక్ సమస్యలు తీర్చేలా కొత్త ఫ్లైఓవర్లు, అండర్ పాసులు మరిన్ని చోట్ల నిర్మిస్తామన్నారు.
ఇక సమ్మర్ నీటి ఎద్దడి ముంచుకొస్తున్న నేపథ్యంలో ప్రధానమైన వాటర్ సమస్యపై కూడా క్లారిటీ ఇచ్చారు. జలమండలి ద్వారా 2024లో పలు విప్లవాత్మక ప్రాజెక్టులను చేపట్టడం జరిగిందన్నారు. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలశయాలపై మొత్తం 20 MLD సామర్ధ్యం కలిగిన 4 మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. మూసీ ప్రక్షాళనలో భాగంగా.. గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ కింద గోదావరి జలాలతో ఉస్మాన్ సాగర్, హిమయత్ సాగర్ జలాశయాలను నింపి వాటిని పునరుజ్జీవింపచేయడానికి అవసరమైన పనులను చేపట్టనున్నట్లు భట్టి స్పష్టం చేశారు. ఓఆర్ఆర్ ఫేజ్-2 నీటి సరఫరా ప్రాజెక్టు చివరి దశకు చేరుకుందని.. ద్వారా హెచ్ఎండీఏ పరిధిలో విస్తరించిన పట్టణ ప్రాంతాలకు త్రాగునీరు అందించబడుతుందన్నారు. పట్టణాలలో వరద సమస్యలను ఎదుర్కొనడానికి ప్రభుత్వం సమగ్ర నీటిపారుదల వ్యవస్థను అభివృద్ధి చేస్తోందని బడ్జెట్ ప్రసంగంలో భట్టి వెల్లడించారు.
మ్యాన్ హోల్స్ పూడిక తీత పనులను ఒక స్పెషల్ డ్రైవ్‌గా చేపట్టినట్లు తెలిపారు. 3,025 కిలోమీటర్ల మురుగు నీటి లైన్లు శుభ్రం చేసి.. 2.39 లక్షల మ్యాన్ హోల్స్‌లో పూడికతీత పూర్తి చేయడం జరిగిందన్నారు. ఫలితంగా ఇప్పటి వరకు మురుగునీటి వ్యవస్థకు సంబంధించిన ఫిర్యాదులు 25 శాతానికి పైగా తగ్గాయన్నారు.