![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 03, 2025, 01:42 PM
కంచ గచ్చిబౌలి భూములకు సంబంధించి నెలకొన్న వివాదంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ భూములను ఎవరూ కొనుగోలు చేయవద్దని హెచ్చరించారు. ఎవరైనా కొనుగోలు చేస్తే నష్టపోతారని చెప్పారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కేజీఎఫ్ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. కేజీఎఫ్ భూములు 400 ఎకరాలను గ్రీన్ జోన్ గా ప్రకటించి, ఎకో పార్క్ గా తీర్చిదిద్ది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్ సీయూ)కి కానుకగా ఇవ్వాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినట్లు తెలిపారు.కేజీఎఫ్ భూములు హైదరాబాద్ ప్రజలకు చెందినవని, ఈ భూములను అమ్మే ఆలోచనను మానుకోవాలని ప్రభుత్వానికి కేటీఆర్ హితవు పలికారు. ఈ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గే దాకా ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ ప్రజల భవిష్యత్తు కోసం బీఆర్ఎస్ పోరాడుతుందని తెలిపారు. ఈ మేరకు గురువారం తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా ప్రవర్తిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓవైపు యూనివర్సిటీ విద్యార్థులు, మరోవైపు పర్యావరణ ప్రేమికులు, ప్రతిపక్షాలు కేజీఎఫ్ భూముల పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్నా రేవంత్ రెడ్డి పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ విధానం స్పష్టంగా వెల్లడించామని, కాంగ్రెస్ పార్టీ విధానం ఏమిటనేది స్పష్టం చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.కేజీఎఫ్ భూములు నిజంగా ప్రభుత్వానికి చెందినవే అయితే దొడ్డిదారిన ఎందుకు వెళుతున్నారంటూ ప్రభుత్వాన్ని కేటీఆర్ ప్రశ్నించారు. అర్ధరాత్రులు చెట్లను నరికివేస్తున్నారని ఆరోపించారు. మంత్రులు తెలిసీతెలియకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్య స్ఫూర్తి కొరవడిందని, కోర్టులు చెప్పినా ప్రభుత్వం వినిపించుకోవడంలేదని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో చెట్లను పెంచి రాష్ట్రంలో హరిత విప్లవానికి తెరలేపామని, కాంగ్రెస్ పార్టీ మాత్రం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ప్రకృతి విధ్వంసానికి పాల్పడుతోందని విమర్శించారు.