![]() |
![]() |
by Suryaa Desk | Sat, Apr 05, 2025, 08:22 PM
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నెలాఖరుతో శాంతి కుమారి పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో.. ఈ వార్తలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. మరి శాంతి కుమారి తన పదవీ కాలం ముగిసే సమయానికి ముందుగానే ఎందుకు రాజీనామా చేయనున్నారు..? ఈ పరిణామం వెనుక అసలు కారణమేంటీ..? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే.. శాంతి కుమారికి రాష్ట్ర సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్ పదవిని కట్టబెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా.. శాంతి కుమారి రాజీనామా చేస్తే.. ఆమె స్థానంలో రామకృష్ణారావును కొత్త సీఎస్‌గా నియమించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
1989 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన శాంతి కుమారి 2023 జనవరి 11 నుంచి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అంతకుముందు సీఎస్‌గా ఉన్న సోమేశ్ కుమార్ ఏపీకి వెళ్లడంతో ఆ స్థానంలో శాంతి కుమారి నియమితులయ్యారు.
అయితే.. రాష్ట్రంలో ప్రధాన సమాచార కమిషనర్ పదవి 2020 ఆగస్టు 24న ఖాళీ అయింది. చివరి సమాచార కమిషనర్ 2023 ఫిబ్రవరి 24న పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత ఆ స్థానాల్లో ఎవరినీ నియమించలేదు. ఢిల్లీలోని కేంద్ర సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్‌తో పాటు రాష్ట్రాల్లోని సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్, కమిషనర్ల పోస్టులను 8 వారాల్లోగా భర్తీ చేయాలని సుప్రీంకోర్టు ఈ ఏడాది జనవరి 7న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.
పైగా.. రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం కమిషనర్లు లేకపోవడం వల్ల ఆర్టీఐ కింద సమాచారం పొందడం కష్టంగా మారిందని చాలామంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలో రాజా సదారాం, బుద్ధామురళి ప్రధాన కమిషనర్లుగా పనిచేశారు. వారి తర్వాత ఆ స్థానంలో ఎవరినీ నియమించకపోవటంతో ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది.
కాగా.. గత ఏడాది జూన్ నెలలో ఈ పదవుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. చాలామంది జర్నలిస్టులు, న్యాయవాదులు, పదవీ విరమణ చేసిన అధికారులు ఈ పదవుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారి దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారి జాబితాను సిద్ధం చేశారని సమాచారం. ఈ క్రమంలో రాష్ట్ర సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్‌గా శాంతి కుమారి ఎంపికయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆమె ఈ పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నారని గత నెల రోజులుగా సచివాలయంలో చర్చ జరుగుతోంది. ఇవాళ జరిగిన సమావేశంలో ఆమె పేరును ఖరారు చేసే అవకాశం ఉందని సమాచారం. ప్రభుత్వం ఆమె పేరును ఖరారు చేయగానే శాంతి కుమారి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుంటారని తెలుస్తోంది.