![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 08, 2025, 06:54 PM
డీలిమిటేషన్ పై హైదరాబాద్‌లో త్వరలో జరగబోయే సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలుసుకునేందుకు పథకం రచించారని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. కేటీఆర్ జైలుకు వెళ్లకుండా రక్షించేది రేవంత్ రెడ్డేనని ఆయన ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.నియోజకవర్గాల పునర్విభజన అంశంపై చెన్నైలో జరిగిన సమావేశానికి వీరిద్దరు హాజరయ్యారని గుర్తు చేశారు. త్వరలో మరోసారి సమావేశమయ్యేందుకు సిద్ధమవుతున్నారని అన్నారు. వీరిద్దరు కలిసి వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎంపీలతో ఓటు వేయించారని బండి సంజయ్ ఆరోపించారు. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఇద్దరు కలిసి మజ్లిస్ పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు సిద్ధమయ్యారని అన్నారు.ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని కాపాడేందుకు కేటీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థిని పోటీలో నిలపలేదని అన్నారు. వరుస ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు గుణపాఠం చెప్పినా కేటీఆర్‌కు బుద్ధి రాలేదని విమర్శించారు. కేటీఆర్, రేవంత్ రెడ్డి ఏకమై బీజేపీని దెబ్బతీసేందుకు మళ్లీ కుట్ర చేస్తున్నారని బండి సంజయ్ ధ్వజమెత్తారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ భూములపై సీబీఐ విచారణకు సిద్ధమా అని సవాల్ చేశారు.