![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 08, 2025, 06:57 PM
తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ తర్వాత అతి పెద్ద పార్టీ బీఆర్ఎస్ అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో 25 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నది టీడీపీ, బీఆర్ఎస్ లే అని చెప్పారు. అందుకే బీఆర్ఎస్ సిల్వర్ జుబ్లీ వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. బీఆర్ఎస్ సిల్వర్ జుబ్లీ వేడుకలు వరంగల్ లో జరగనున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు.వరంగల్ ఎల్కతుర్తిలో 1,200 ఎకరాల్లో పార్కింగ్ తో పాటు బహిరంగసభకు ఏర్పాట్లు జరుగుతున్నాయని కేటీఆర్ చెప్పారు. 3 వేల బస్సులు ఇవ్వాలని ఆర్టీసీని కోరామని... ఆర్టీసీ సూత్రప్రాయంగా అంగీకరించిందని తెలిపారు. బీఆర్ఎస్ చరిత్రలోనే ఈ సమావేశం అతిపెద్ద సమావేశం అవుతుందని చెప్పారు. బహిరంగ సభ తర్వాత కార్యకర్తలు, విద్యార్థుల సభ్యత్వాలను నమోదు చేస్తామని తెలిపారు. సభ్యత్వ నమోదు పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జరుగుతుందని చెప్పారు. సభ్యత్వ నమోదు తర్వాత పార్టీ అధ్యక్ష ఎన్నిక ఉంటుందని తెలిపారు.రాష్ట్ర కమిటీలతో పాటు జిల్లా కమిటీలను వేసుకుంటామని... ఆ తర్వాత జిల్లాల వారీగా కార్యకర్తలకు శిక్షణ సమావేశాలు ఉంటాయని కేటీఆర్ చెప్పారు. 12 నెలల పాటు ప్రతి నెల ఒక్కొక్క కార్యక్రమం నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. బహిరంగసభకు ప్రభుత్వం అనుమతిని ఇవ్వకపోతే కోర్టు ద్వారా అనుమతిని పొందుతామని చెప్పారు.