![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 10, 2025, 02:35 PM
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ, సీనియర్ నేత కే లక్ష్మణ్ స్పందించారు.నిజాం పాలనలో రజాకార్లను తరిమికొట్టినట్లు దేశం నుంచి కాంగ్రెస్ ను తరిమికొట్టడం ఖాయమని లక్ష్మణ్ చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ మరోమారు అధికారంలోకి రావడం అసాధ్యమని, ఆ పార్టీ నుంచి రేవంత్ రెడ్డే చివరి ముఖ్యమంత్రి అని అన్నారు. రేవంత్ రెడ్డిలో అసహనం, అభద్రత కనిపిస్తోందని, ఆ ఆందోళనతోనే రాహుల్ గాంధీ మెప్పుకోసం బీజేపీపై అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నారని అన్నారు. బీజేపీ నేతలది బ్రిటీష్ వారసత్వం అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలను లక్ష్మణ్ తీవ్రంగా ఖండించారు. నిజానికి బ్రిటీష్ పాలకుల వారసత్వాన్ని అందిపుచ్చుకున్నది కాంగ్రెస్ నేతలేనని విమర్శించారు.ప్రస్తుతం దేశవ్యాప్తంగా తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ లలో కాంగ్రెస్ అధికారంలో ఉందని చెప్పారు. ఆ మూడు రాష్ట్రాల్లోని ప్రభుత్వాల పరిస్థితి తుమ్మితే ఊడిపోయే ముక్కులాగే ఉందని ఎద్దేవా చేశారు.