![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 10, 2025, 04:18 PM
తెలంగాణలోని సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షం పడుతోంది. ఉరుములు మెరుపులతో బీభత్సమైన గాలివాన ఏకధాటిగా కురుస్తోంది. దీంతో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లోనూ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పశ్చిమ మధ్య మరియు దానికి అనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతున్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఉపరితల ఆవర్తనం మధ్య ట్రోపోస్పిరిక్ ఆవరణం వరకు విస్తరించి ఉందని పేర్కొంది. ఇది వచ్చే 12 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దాదాపు ఉత్తర వైపునకు కదిలే అవకాశం ఉందని తాజా బులెటిన్ లో తెలిపింది.హైదరాబాద్ వెదర్ మ్యాన్ బాలాజీ తాజా రిపోర్ట్ ప్రకారం…. కాసేపట్లో హైదరాబాద్ లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. సాయంత్రం 6 వరకు ఈ పరిస్థితి ఉండొచ్చని అంచనా వేసింది.సంగారెడ్డి, మెదక్ మీదుగా ఈ ప్రభావం హైదరాబాద్ కు చేరుకుంటుందని పేర్కొంది. మియాపూర్, కుత్బుల్లాపూర్ పరిసర ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులు వీచే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత సెంట్రల్ హైదరాబాద్ కు విస్తరించే అవకాశం ఉంది. ఇందుకు అనుగుణంగా ప్రజలు… ముందుస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. నిజామాబాద్, కామారెడ్డి, నల్గొండ, సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట, వికారాబాద్ జిల్లాలోనూ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.