|
|
by Suryaa Desk | Sat, Apr 12, 2025, 06:45 PM
తెలంగాణలోని ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు ఆర్టీసీ యాజమాన్యం గుడ్‌న్యూస్ చెప్పింది. ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్ పథకాన్ని రద్దు చేసే ప్రతిపాదన లేదని ఆర్టీసీ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగింపు కారణంగానే జీతాలు ఆలస్యమయ్యాయని తెలిపింది. ఎలక్ట్రిక్ బస్సుల కారణంగా ఉద్యోగుల్ని తొలగిస్తామన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని అన్నారు. ఉద్యోగులు ఎవర్నీ తొలగించబోమని స్పష్టం చేసింది. పెండింగ్ బకాయిల్ని త్వరలోనే క్లియర్ చేస్తామని చెప్పింది. సంస్థపై చేస్తున్న దుష్ప్రచారాలు మానుకోవాలని హితవు పలికింది.
కాగా, మహాలక్ష్మి పథకం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తోంది. ఈ నేపథ్యంలో బస్సుల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. కొన్ని బస్సుల్లో అయితే కాలు పెట్టేందుకు కూడా జాగా ఉండట్లేదు. జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్ వచ్చే వారి సంఖ్య డబుల్ అయింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ కొత్తగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతోంది. పర్యావరణ అనుకూలమైన రవాణాను ప్రోత్సహించడంలో భాగంగా ఈ చర్యలు తీసుకుంటున్నారు. 2025 డిసెంబర్ నాటికి హైదరాబాద్‌లో పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే కొన్ని ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. వీటిలో ఎయిర్ కండిషన్డ్ మరియు నాన్-ఏసీ బస్సులు ఉన్నాయి.
మొత్తంగా 2,500 ఎలక్ట్రిక్ బస్సులను దశలవారీగా ప్రవేశపెట్టాలని ఆర్టీసీ టార్గెట్‌గా పెట్టకుంది. కొత్తగా ప్రవేశపెడుతున్న వాటిలో మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం నడుస్తున్న ఎలక్ట్రిక్ బస్సులు ప్రధానంగా విమానాశ్రయం, ఐటీ కారిడార్ ప్రాంతాల్లో తిరుగుతున్నాయి. కొత్తగా వచ్చే బస్సులను డిమాండ్ ఎక్కువగా ఉన్న రూట్లలో నడపనున్నారు. కొన్ని ఇంటర్-సిటీ రూట్లలో కూడా ఎలక్ట్రిక్ బస్సులను నడపాలని ఆర్టీసీ యోచిస్తున్నారు, కరీంనగర్-హైదరాబాద్, నిజామాబాద్-హైదరాబాద్ రూట్లలో బస్సులు నడపనున్నారు.
ప్రస్తుతం వరంగల్ రీజియన్‌కు 50 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతున్నారు. ఈ బస్సులు ప్రైవేటు ప్రతిపాదకన నడపుతుండగా.. వీటి ద్వారా డ్రైవర్ ఉద్యోగాలు పోతాయనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఉద్యోగాలకు ఎలాంటి ఢోకా లేదని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు.