|
|
by Suryaa Desk | Thu, Apr 17, 2025, 05:06 PM
అత్తాకోడళ్లు గురించి మాట్లాడితే మర్యాద ఉండదని పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి హెచ్చరించారు. అత్తాకోడళ్లు అంటే అంత చులకనా అని ప్రశ్నించారు. ప్రతి ఒక్కరికీ కుటుంబాలు ఉంటాయని గుర్తుంచుకోవాలని అన్నారు. అత్తాకోడళ్లు సీరియళ్లు చాలా ఆసక్తిగా ఉంటాయని ఎర్రబెల్లి దయాకర్ రావు చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించారు.నిత్యం అత్తాకోడళ్లు అని మాట్లాడుతున్నారని, అలాంటి వినోదం కావాలంటే అందరి ఇళ్లలో అత్తాకోడళ్ల సమాచారం తీసుకొచ్చి ఇస్తానని ఎర్రబెల్లిని ఉద్దేశించి ఎద్దేవా చేశారు. నిత్యం తమను లక్ష్యంగా చేసుకొని మాట్లాడుతున్నారని, కానీ తనకు ఎంత చెడు చేయాలని చూస్తే దేవుడు తనకు అంత మంచి చేస్తాడని అన్నారు.ఆమె ఇంకా మాట్లాడుతూ, కాంగ్రెస్ నాయకులను తక్కువ అంచనా వేయవద్దని, తమ జోలికి వస్తే తరిమికొడతామని హెచ్చరించారు. ఎర్రబెల్లి తన వయస్సుతో పాటు హుందాతనాన్ని కాపాడుకోవాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా ఏమిటో చూపిస్తామని అన్నారు. అమ్మాయి చిన్నది, సాఫ్టుగా ఉందని అనుకోవద్దని హెచ్చరించారు.పాలకుర్తిని దోచుకుంది, దాచుకుంది బీఆర్ఎస్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు అని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు భూకబ్జాలు చేసి ప్రజల సొమ్మును దోచుకున్నారని అన్నారు. తాము ఆడోళ్లం మాత్రమే కాదని, ఆడ పులులం అని వ్యాఖ్యానించారు. తాము అత్తాకోడళ్లమే పార్టీని కాపాడుకుంటూ పాలకుర్తిని అభివృద్ధి చేస్తున్నామని అన్నారు.