|
|
by Suryaa Desk | Sat, Apr 19, 2025, 12:47 PM
జలమండలి సరఫరా చేసే నీటిని అక్రమంగా మోటార్లతో తోడుతున్న వారిపై జలమండలి చేపట్టిన డ్రైవ్ పై ఎండీ అశోక్ రెడ్డి దృష్టి సారించారు. మోటార్ ఫ్రీ టాప్ డ్రైవ్ ప్రారంభించిన రెండో రోజూ క్షేత్ర స్థాయిలో పర్యటించారు. జలమండలి ఓ అండ్ ఎం డివిజన్ - 6, ఎస్ ఆర్ నగర్ లోని మధురానగర్ పరిసర ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. రోజు ఎస్ ఆర్ నగర్, మధురానగర్ లో ముఖ్యంగా హాస్టళ్లు, వాణిజ్య సముదాయాలు ఉన్న ప్రాంతంలో లో-ప్రెషర్ తలెత్తుతున్న ప్రాంతాలలో ఇంటింటికి వెళ్లి తనిఖీలు చేశారు. కొందమంది వినియోగదారుల ఇండ్లలో అక్రమంగా మోటార్లు వినియోగిస్తూ పట్టబడగా వారి మోటార్లను సీజ్ చేసి పెనాల్టీ విధించారు. ఈ నేపథ్యంలో ఎండీ అశోక్ రెడ్డి ఓ హాస్టల్ ప్రాంగణంలోకి వెళ్ళగా.. ఆ యజమాని తన నల్లాకు వ్యవసానికి వినియోగించే 2 హెచ్ పి మోటర్ తో నీటిని తోడడంతో యజమానిపై ఆగ్రహం వెలిబుచ్చారు. పది ఇళ్లకు సరిపడా నీటిని నువ్వు ఒక్కడే వాడితే మిగతా వాళ్ళు ఏమైపోవాలి ప్రశ్నించారు. మరోసారి ఇలాంటి తప్పు చేస్తే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. అలాగే ఆ హాస్టల్ కు నెలవరకు నీటిని నిలిపివేసి, ట్యాంకర్ సైతం బుక్ చెయ్యకుండా బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఇదే ప్రాంతంలో మరో భవనానికి సైతం వ్యవసాయ మోటార్ వాడుతూ పట్టుపడగా కనెక్షన్ తొలగించి, నెలవరకు ట్యాంకర్ కూడా సరఫరా నిలిపివేయమని ఎండీ అధికారులకు సూచించారు.