|
|
by Suryaa Desk | Sat, Apr 26, 2025, 08:08 PM
ఈరోజు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి ఆచారి కుంట చెరువును బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ స్థానిక మాజీ ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి సందర్శించారు.ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ గారు మాట్లాడుతూ.... పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, భూగర్భ జలాల నీటిమట్టం సమృద్ధిగా పెరిగినట్లయితే భవిష్యత్తు తరాలకు నీటి ఎద్దడి ఉండదని అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మిషన్ కాకతీయ ద్వారా అనేక చెరువులను పునరుద్ధరించామని, రానున్న రోజుల్లో కూడా ఆచారి కుంట చెరువు అభివృద్ధికై మీరు గెలిపించిన ఎమ్మెల్యేగా, మీ సేవకునిగా ఎన్ని నిధులైన కేటాయించి అభివృద్ధి పరుస్తామన్నారు. చెరువు అభివృద్ధిలో భాగంగా వాకింగ్ ట్రాక్, హైమాస్ లైట్లు, పిల్లల ఆటవిడుపుకై పార్క్ అభివృద్ధి పనులకు అవసరమైన ప్రణాళికలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం సాయి బృందావన్ ఎస్టేట్స్, వెంకట సాయి హోమ్స్, స్వాన్ లేక్ అపార్ట్మెంట్స్ వాసులు ఎమ్మెల్యే గారికి పుష్పగుచ్చం అందజేసి శాలువాలతో సత్కరించారు. అంతకముందు సాయి బృందావన్ ఎస్టేట్స్ వద్ద శ్రీ బాలాజీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే గారు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, మాజీ కార్పొరేటర్లు రాఘవేంద్రరావు, ఆగం రాజు, గాజుల సుజాత, రవి కిరణ్, సాయి బృందావన్ ఎస్టేట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బొబ్బ శ్రీనివాసరావు, స్థానిక బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు , మహిళా నాయకురాలు, సంక్షేమ సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.