|
|
by Suryaa Desk | Mon, Apr 28, 2025, 02:07 PM
భారత్ పై అణుదాడి చేస్తామంటూ పాకిస్తాన్ చేస్తున్న బెదిరింపులపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా స్పందించారు. పాకిస్తాన్ ను ఐసిస్ వారసులుగా అభివర్ణించారు.భారత్ ను బెదిరించే పరిస్ధితుల్లో పాకిస్తాన్ ఉందా అని ప్రశ్నించారు. సింధు జలాల నిలిపివేతపై పాకిస్తాన్ చేస్తున్న బెదిరింపులకు ఓవైసీ ఘాటు కౌంటర్ ఇచ్చారు.అమాయకపౌరుల్ని మతం పేరుతో చంపుతున్న ఐసిస్ తో పాకిస్తాన్ ను అసదుద్దీన్ ఓవైసీ పోల్చారు. పహల్గాంలో టూరిస్టుల్ని మతం ఏంటని అడిగి చంపారట, మీరు ఏ మతం గురించి మాట్లాడుతున్నారు ? మీరు పిరికివాళ్లకంటే దారుణం, ఐసిస్ వారసులు మీరు అంటూ ఓవైసీ తీవ్ర విమర్శలు గుప్పించారు. భారత్ తో యుద్ధానికి అంత తొందరపడొద్దని, భారత్ సైనిక, ఆర్ధిక బలంతో పాకిస్తాన్ ఏమాత్రం సరితూగలేదంటూ ఓవైసీ తేల్చిచెప్పారు.పాకిస్తాన్ భారత్ కంటే అరగంట మాత్రమే వెనుకబడి లేదని, అర్ధశతాబ్దం వెనుకబడి ఉందని ఓవైసీ గుర్తుచేశారు. మీ జాతీయ బడ్జెట్ కంటే మా మిలిటరీ బడ్జెట్ ఎక్కువన్న సంగతి గుర్తుపెట్టుకోవాలని సూచించారు. భారత్ ను అణుయుద్ధం పేరుతో బెదిరించడం కాదని, పొరుగు దేశంలో అమాయకుల్ని చంపుతుంటే ఎవరూ మౌనంగా ఉండరని తెలిపారు. భారత్ పై ప్రయోగించేందుకు ఘోరీ, షహీన్, ఘజ్నవీ సహా 130 అణు వార్ హెడ్లు సిద్ధంగా ఉన్నాయని పాకిస్తాన్ ఉప ప్రధాని హనీఫ్ అబ్బాసీ చేసిన విమర్శలకు ఓవైసీ కౌంటర్ ఇచ్చారు.