|
|
by Suryaa Desk | Mon, Apr 28, 2025, 06:52 PM
గ్రూప్-1 నియామకాలపై ఇటీవల హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ సోమవారం అప్పీల్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై హైకోర్టు సీజే ధర్మాసనం రేపు విచారణ చేపట్టనుంది. మెయిన్స్ పరీక్షల మూల్యాంకనం సరిగా చేయలేదని, పరీక్ష కేంద్రాల కేటాయింపులోనూ నిబంధనలు పాటించలేదని పిటిషనర్లు పేర్కొన్నారు. దీనిపై ఇటీవల విచారణ చేపట్టిన జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం.. నియామకాలు తాత్కాలికంగా నిలిపివేయాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ధ్రువపత్రాల పరిశీలన చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సీజే ధర్మాసనంలో టీజీపీఎస్సీ పిటిషన్ దాఖలు చేసింది. సీజే ధర్మాసనంలో అప్పీలు దాఖలు చేసినట్లు టీజీపీఎస్సీ తరఫు న్యాయవాది సింగిల్ బెంచ్‌కు తెలిపారు. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై ఇవాళ జరగాల్సిన విచారణను జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు బుధవారానికి వాయిదా వేశారు.