|
|
by Suryaa Desk | Sat, May 03, 2025, 08:32 PM
నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశంలో రోడ్ల నిర్మాణం వేగవంతమైందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. గత పదేళ్లుగా జాతీయ రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని, తెలంగాణలోని 33 జిల్లాల్లో 32 జిల్లాల గుండా జాతీయ రహదారులు వెళ్తున్నాయని ఆయన వెల్లడించారు. రోడ్ల అభివృద్ధి పెట్టుబడులను ఆకర్షిస్తుందని, రహదారుల అనుసంధానం అత్యంత ముఖ్యమని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. వాజ్‌పేయి హయాంలో ఎన్డీయే ప్రభుత్వం 'స్వర్ణ చతుర్భుజి' పథకాన్ని ప్రారంభించిందని.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దానిని నిలిపివేసిందని విమర్శించారు.
2014లో తెలంగాణలో 2,500 కిలోమీటర్ల జాతీయ రహదారులు ఉండగా.. పదేళ్లలో అవి 5,200 కిలోమీటర్లకు పెరిగాయని వివరించారు. తెలంగాణలో రింగ్ రోడ్ల అభివృద్ధి జరుగుతోందని.. పెట్టుబడులు ఆకర్షించే ప్రాంతాలకు రహదారులు నిర్మిస్తున్నామని కిషన్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్-శ్రీశైలం మధ్య ప్రయాణ సమయం తగ్గించడానికి రోడ్ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య వారధిగా ఉండే హైదరాబాద్-విజయవాడ హైవేను ఆరు లైన్లుగా నిర్మించటానికి ప్రయత్నిస్తున్నామని కిషన్ రెడ్డి వెల్లడించారు.