|
|
by Suryaa Desk | Sun, Jun 01, 2025, 11:22 PM
తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ వేగవంతం అయింది. తాజాగా మరో 2 లక్షల రేషన్ కార్డులను మంజూరు చేయడంతో.. రాష్ట్రంలో మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 91.83 లక్షలకు చేరింది. ఈ పెరుగుదలతో మొత్తం లబ్ధిదారుల సంఖ్య 3.10 కోట్లకు చేరింది. అధికారులు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి ఈ 2 లక్షల మందికి కొత్తగా కార్డులు ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు. మిగిలిన దరఖాస్తుల పరిశీలన కూడా కొనసాగుతోందని.. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారికి కూడా రేషన్ కార్డులు మంజూరు చేస్తామని అధికారులు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదల కోసం "ప్రజాపాలన" కార్యక్రమం ద్వారా, అలాగే మీసేవ కేంద్రాల ద్వారా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. దీనితో పెద్ద సంఖ్యలో ప్రజలు రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు సమర్పించారు. అయితే.. ప్రభుత్వం గతంలో పలు దఫాలుగా దరఖాస్తులు స్వీకరించినప్పటికీ, కార్డుల జారీలో కొంత జాప్యం జరిగింది.
కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నవారితో పాటు.. ఇప్పటికే ఉన్న కార్డులలో మార్పులు, చేర్పుల కోసం దరఖాస్తు చేసినవారు కూడా స్పష్టమైన స్పందన లేక ఇబ్బందులు పడ్డారు. రేషన్ కార్డు లేకపోవడం వల్ల సబ్సిడీ ధాన్యాలు, అలాగే ఆరోగ్యశ్రీ, పింఛన్లు వంటి అనేక సంక్షేమ పథకాల సౌకర్యాలను లబ్ధిదారులు పొందలేకపోతున్నారు. ఈ సమస్యను తక్షణమే పరిష్కరించి, దరఖాస్తు చేసుకున్న వారందరికీ త్వరగా రేషన్ కార్డులు అందజేయాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరారు. తాజాగా ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం ఇప్పటి వరకు కార్డు లేని వారు.. కొత్తగా రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకున్నా, లేదా ఉన్న కార్డులలో మార్పులు చేర్పులు చేసుకున్నా మంజూరు చేస్తారా లేదా అనే అనుమానాలు ప్రజల్లో నెలకొన్నాయి. ఈ సందేహాలను నివృత్తి చేస్తూ, అధికారులు కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కూడా రేషన్ కార్డులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పుడు ఇస్తున్న కార్డులు ఫైనల్ కాదని.. అర్హులైన వారు దరఖాస్తు చేస్తే వారికి కూడా కార్డులు త్వరలోనే ఇస్తామని అధికారులు తెలిపారు.
నేటి నుంచి రేషన్ కార్డు కలిగిన ప్రతీ ఒక్కరూ ఒకేసారి మూడు నెలలకు సరిపడా సన్నబియ్యాన్ని తీసుకోవచ్చునని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయం ప్రజలకు మరింత ఊరటనిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డుల జారీని వేగవంతం చేయడం ద్వారా పేదలకు అందించే సంక్షేమ సేవలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులను తీసుకురావడానికి దోహదపడుతుంది.