|
|
by Suryaa Desk | Wed, Feb 04, 2026, 07:45 PM
వస్తున్నది వేసవి కాలం. నిప్పు రగిలితే మంటలు వ్యాపించి భారీ మొత్తంలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తుంది. ఇలాంటి తరుణంలో ప్రతి ఒక్కరూ ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పటికే హైడ్రా తనిఖీలు చేసి కొన్ని షాపులను సీజ్ చేయడమైంది. నెల రోజులు వ్యవధి కావాలని షాపుల యజమానులు, వ్యాపార సంఘాలకు చెందిన ప్రతినిధులు విజ్ఞప్తి చేయగా హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్‌గారు ఫిబ్రవరి నెలవరకూ సమయం ఇచ్చారు. ఇదే సమయంలో అగ్ని ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలను హైడ్రా చేపట్టింది. నగర వ్యాప్తంగా మాక్ డ్రిల్స్, అవగాహన కార్యక్రమాలను సంబంధిత శాఖలతో కలిసి హైడ్రా పెద్దయెత్తున నిర్వహిస్తోంది. ఎవరికి వారు ఆలోచించి అగ్ని ప్రమాదాలకు ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు అనుసరించాల్సిన ప్రాథమిక అంశాలను ఈ కిందన పొందుపరుస్తున్నాం. వీటిని తూచా తప్పకుండా పాటించాలని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు నగర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఈ కింది జాగ్రత్తలు కూడా తీసుకోండి..
విద్యుత్ బల్బులు, ట్యూబ్‌లైట్లకు దగ్గరగా ఎలాంటి వస్తువులు నిలువ ఉంచరాదు. డోర్ కర్టైన్లు, దుస్తులు ఉంచరాదు.. బల్బు వెడికి నెమ్మదిగా మంటలు అంటుకునే ప్రమాదం ఉంటుంది.
షాపు అలంకరణకు ఉద్దేశించిన వైర్ల జాయింట్లు, సీరియల్ బల్బులు, ఫాల్ సీలింగ్ లైట్లు అమర్చేటప్పడు ఎక్కడైనా కరెంటు షార్ట్ సర్క్యూట్ అయ్యేప్రమాదం ఉండకుండా చూడండి.
మరీ ముఖ్యంగా అపార్టుమెంట్లు కింది భాగంలో వ్యాపార కార్యకలాపాలు, షాపుల మాదిరి వినియోగిస్తే మరింత అప్రమత్తంగా ఉండండి. మంటలకు ఆస్కారం లేకుండా జాగ్రత్త పడండి.
మీ ఇంటికి చేరువలో అగ్ని ప్రమాదానికి ఆస్కారం ఉండే పరిస్థితులున్నా.. ఫైర్ నిబంధనలు ఉల్లంఘించినట్టు ఎవరైనా గమనిస్తే.. హైడ్రా కంట్రోల్ రూమ్ 9000113667 నంబరుకు పూర్తి సమాచారంతో పాటు.. వీడియోలు, ఫొటోలు, కరెంట్ లొకేషన్‌ను చెబుతూ సమాచారం ఇవ్వండి. అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ ఇంజిన్ కోసం, మంటలను ఆర్పడం కోసం 101 కి ఫోను చేయాలి.