|
|
by Suryaa Desk | Wed, Dec 06, 2023, 11:18 AM
మిచౌంగ్ తుపాను నేపథ్యంలో వాతావరణంలో నెలకొన్న మార్పుల కారణంగా తెలంగాణలో ఖమ్మం, సింగరేణి ప్రాంతం సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడ తెరిపిలేని వర్షం కారణంగా బొగ్గు ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. కోయగూడెం ఉపరితల గనిలో 13 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 45 వేల క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులు ఆగిపోయాయి. అటు జేవీఆర్ ఓసీ, కిష్టారం ఓసీలోనూ బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, జనగామ, నల్లగొండ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశాలున్నయాని తెలిపిన వాతావారణ శాఖ, ఈ నేపథ్యంలో ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది.
అలాగే జనగామ, కుమ్రంభీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, మెదక్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఈ క్రమంలోనే ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదుగుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.