by Suryaa Desk | Sat, Sep 21, 2024, 11:26 AM
మంచిర్యాల జిల్లా భీమిని మండలం చిన్న తిమ్మాపూర్ తంగళ్ళపల్లి గ్రామాల మధ్య ఎర్ర వాగు ఉప్పొంగింది. నిన్న సాయంత్రం వర్షం కురవడంతో ఎర్రవాగు ఉప్పొంగింది.దీంతో ఎర్రవాగు పరిసర ప్రాంతాల్లో నీరు చేరాయి. అయితే ఎగువన కురుస్తున్న వర్షాలకు చిన్న తిమ్మాపూర్-తంగళ్లపల్లి గ్రామాల మధ్య ఉన్న ఎర్ర వాగు పొంగిపొర్లడంతో ట్రాక్టర్ సహా ఆరుగురు అందులో చిక్కుకున్నారు. మాడవెల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని బొట్టపల్లికి చెందిన రైతు అత్కారి రవి ట్రాక్టర్‌లో మందు బస్తాలను ఎక్కించుకుని ఐదుగురు కూలీలతో కలిసి వాగు మీదుగా తిమ్మాపూర్‌లోని పాటి చేను వద్దకు చేరుకున్నాడు. పత్తికి మందు వేసి తిరిగి వస్తుండగా ఒక్కసారిగా వాగు పొంగిపొర్లింది. దీంతో ట్రాక్టర్‌తో పాటు అందులో ఐదుగురు కూలీలు ఇరుక్కుపోయారు. పెద్దగా కేకలు వేయడంతో గమనించిన స్థానికులు, గ్రామస్థులు తాళ్ల సహాయంతో ఆరుగురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ట్రాక్టర్ కాలువలోనే ఉండిపోయింది. మరోవైపు ఎర్రవాగుపై వంతెన లేకపోవడంతో వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే వంతెన నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.