![]() |
![]() |
by Suryaa Desk | Wed, Apr 02, 2025, 09:16 PM
కంచె గచ్చిబౌలి భూముల్లో గురువారం వరకు ఎలాంటి పనులు చేయొద్దని ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంపై బుధవారం తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం గతేడాది జీవో 54 తీసుకువచ్చిందని.. దాని ద్వారా 400 ఎకరాలను టీజీఐఐసీకి అప్పగించారని తెలిపారు. చెట్లను కొట్టేసి, భూమిని చదును చేస్తున్నారని.. అటవీ ప్రాంతాన్ని కొట్టేయాలంటే నిపుణుల కమిటీ వేయాల్సిందేనన్నారు. నిబంధనలకు విరుద్ధంగా అధికారులు పని చేస్తున్నారని, సుప్రీంకోర్టు తీర్పునకు లోబడే ప్రభుత్వాలు పని చేయాలన్నారు.ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపించారు. 2004లో ఈ భూమిని ఐఎంజీ అకాడమీకి అప్పగించారని, ఒప్పందం ప్రకారం ఐఎంజీ ఆ భూములను వినియోగించలేదని తెలిపారు. ఐఎంజీకి కేటాయించిన భూములను అప్పటి ప్రభుత్వం రద్దు చేసిందని, ఈ భూముల్లో అటవీ భూమి అని ఎక్కడా లేదని, ఈ భూమికి ఆనుకొని ఉన్న హెచ్‌సీయూ భూముల్లో భారీ భవనాలు నిర్మించారన్నారు. ఈ భూమికి సమీపాన నాలుగు హెలీప్యాడ్‌లు ఉన్నాయని, హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో పాములు, నెమళ్లు, చెట్లు ఉన్నాయంటూ ఏజీ వాదనలు వినిపించారు. పిటిషనర్ల వాదనలను బట్టి ఆయా ప్రాంతాలను అటవీ భూమిగా ప్రకటించాలని.. ఈ లెక్కనా హైదరాబాద్ మహానగరంలో ఎక్కడా నిర్మాణాలు చేపట్టకూడదన్నారు. ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది. అప్పటి వరకు ఆ భూముల్లో ఎలాంటి పనులు చేయొద్దని ఆదేశించింది.