![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 03, 2025, 09:27 AM
ప్రియుడి మోజులో కన్నతల్లే ముగ్గురు పిల్లలకు విషమిచ్చి చంపిన ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో జరిగింది. అంతేకాదు, ఆ మహిళ తన భర్తను కూడా హతమార్చాలని ఆమె పథకం వేసింది. చెన్నయ్య, రజిత (38) దంపతులు అమీన్‌పూర్‌లో నివాసం ఉంటున్నారు. చెన్నయ్య వాటర్ ట్యాంకర్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, రజిత స్థానిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇటీవల జరిగిన పదో తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో రజిత తన పాత స్నేహితుడు శివకుమార్ ను కలిసింది. వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ప్రియుడితో కలిసి జీవించాలని నిర్ణయించుకున్న రజిత, భర్తను, పిల్లలను అడ్డు తొలగించాలని పథకం వేసింది. మార్చి 27న రాత్రి భోజనంలో పిల్లలకు పెరుగులో విషం కలిపింది. భర్త చెన్నయ్య పప్పు మాత్రమే తిని పనిమీద బయటకు వెళ్ళాడు. తిరిగి రాత్రి 11 గంటలకు ఇంటికి వచ్చి చూడగా ముగ్గురు పిల్లలు మృతి చెంది ఉండటంతో షాక్‌కు గురయ్యాడు. రజిత కడుపు నొప్పి అని నాటకం ఆడటంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. తొలుత భర్త చెన్నయ్యపై అనుమానం వ్యక్తం చేసినప్పటికీ, విచారణలో అసలు నిజం బయటపడింది. రజితనే పిల్లలను చంపిందని పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం రజిత ప్రియుడిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీనిపై పోలీసులు మీడియా సమావేశం నిర్వహించారు. సంగారెడ్డి ఎస్పీ మాట్లాడుతూ... రజిత, ఆమె భర్త చెన్నయ్య మధ్య 20 ఏళ్ల వ్యత్యాసం ఉందని వెల్లడించారు. భర్తతో కలిసి ఉండడానికి ఆమె ఇష్టపడలేదని తెలిపారు. తొలుత పిల్లలను, ఆ తర్వాత భర్త చెన్నయ్యను హత్య చేసేందుకు ప్లాన్ చేసిందని ఎస్పీ వివరించారు. రజితను, శివకుమార్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని చెప్పారు.