![]() |
![]() |
by Suryaa Desk | Thu, Apr 03, 2025, 09:31 AM
హైదరాబాద్ నగరంలోని కంచ గచ్చిబౌలి భూములపై వట ఫౌండేషన్, హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయు) విద్యార్థులు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై తెలంగాణ హైకోర్టులో వాదనలు కొనసాగాయి. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు ఈ భూముల్లో రేపటి వరకు పనులు నిలిపివేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.కంచ గచ్చిబౌలి భూములను జాతీయ ఉద్యానవనంగా ప్రకటించాలంటూ ఈ పిల్ దాఖలైంది. దీనిపై ఉన్నత న్యాయస్థానంలో వాదనలు కొనసాగాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తరఫున ఎల్. రవిశంకర్ వాదనలు వినిపించారు.గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం జీవో 54 తీసుకొచ్చిందని, ఈ జీవో ప్రకారం 400 ఎకరాల ప్రభుత్వ భూమిని టీజీఐఐసీకి ఇస్తున్నట్లు పేర్కొన్నారని కోర్టుకు తెలిపారు. అది ప్రభుత్వ భూమి అయినా సుప్రీంకోర్టు తీర్పులకు లోబడి ప్రభుత్వాలు పని చేయాల్సి ఉంటుందని తెలిపారు. కంచ గచ్చిబౌలి భూముల వద్ద జేసీబీలను ఉపయోగించి చెట్లను కొట్టేసి, భూమిని చదును చేస్తున్నారని కోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అటవీ ప్రాంతాన్ని తొలగించాలంటే నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని తెలిపారు. అక్కడ మూడు చెరువులు ఉన్నాయని, బండ రాళ్లు ఉన్నాయని, ఎన్నో అరుదైన జంతువులు ఉన్నాయని తెలిపారు. వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ఉందని అన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. 2004లో ఈ భూములను ఐఎంజీ అకాడమీకి అప్పగించారని, ఒప్పందం ప్రకారం భూములను వినియోగించలేదని అన్నారు. దీంతో ఆ తర్వాత ప్రభుత్వం కేటాయింపును రద్దు చేసిందని తెలిపారు. ఆ భూముల్లో అటవీ భూమి అని ఎక్కడా లేదని అన్నారు.హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో పాములు, నెమళ్లు, చెట్లు ఉన్నాయని, పిటిషనర్ల వాదనల ప్రకారం ఆయా ప్రాంతాలను కూడా అటవీ భూములుగా ప్రకటించాల్సి ఉంటుందని అన్నారు. ఈ లెక్కన హైదరాబాద్ మహా నగరంలో ఎక్కడా నిర్మాణాలు చేపట్టకూడదని పేర్కొన్నారు. అదే సమయంలో ఇప్పటి వరకు ఇది అటవీ భూమి అనే వాదన కూడా లేదని కోర్టుకు తెలిపారు. అటవీ భూములని ప్రభుత్వం ఎక్కడా నోటిఫై చేయలేదని అన్నారు.