![]() |
![]() |
by Suryaa Desk | Sat, Apr 05, 2025, 08:40 PM
రక్షణ శాఖ ఆధ్వర్యంలోని విమానాశ్రయంలో పౌర విమాన సేవలు ప్రారంభించడానికి కేంద్ర రక్షణ మంత్రి రాజ్‍నాథ్ సింగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వాయుసేన శిక్షణ సంస్థతో పాటు పౌర విమాన సేవలు కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఈమేరకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి రాజ్‍నాథ్ సింగ్ కీలక లేఖ రాశారు. ఆ లేఖలో ఆదిలాబాద్ విమానాశ్రయంలో పౌర విమాన సేవలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
ఆదిలాబాద్‌లో విమానాశ్రయం ఏర్పాటు చేయాలనేది ఎప్పటి నుంచో ఉన్న కోరిక. ఈ క్రమంలో.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన విజ్ఞప్తికి స్పందిస్తూ రాజ్‍నాథ్ సింగ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకుగానూ ప్రధాని నరేంద్ర మోదీ, రాజ్‍నాథ్ సింగ్, రామ్మోహన్ నాయుడుకు కిషన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వరంగల్ విమానాశ్రయానికి అనుమతులు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే పనులు త్వరగా పూర్తవుతాయని కిషన్ రెడ్డి తెలిపారు.
కిషన్ రెడ్డి గతంలో రాజ్‍నాథ్ సింగ్‍కు ఒక లేఖ రాశారు. ఆదిలాబాద్ విమానాశ్రయానికి సంబంధించిన భూములను ప్రజల కోసం ఉపయోగించాలని కోరారు. దీనిపై స్పందించిన రాజ్‍నాథ్ సింగ్ సానుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. కీలకమైన ఆదిలాబాద్ విమానాశ్రయంలో వాయుసేన శిక్షణ సంస్థను ఏర్పాటు చేయబోతున్నామని, దీంతోపాటు.. పౌర విమాన సేవల కోసం ఉమ్మడి కార్యాచరణ చేపట్టేందుకు సానుకూలంగా ఉన్నట్లు స్పష్టం లేఖలో చేశారు.
ఈ విషయంపై మాట్లాడిన కిషన్ రెడ్డి.. పత్తి వ్యాపారానికి ఆదిలాబాద్ ఒక ముఖ్యమైన కేంద్రమని.. అందుకే ఇక్కడ విమానాశ్రయం ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. గతంలో తాను ముఖ్యమంత్రికి కూడా లేఖలు రాశానని, కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన స్పందన రాలేదని ఆయన విమర్శించారు. పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా ముఖ్యమంత్రికి లేఖ రాశారని, అయినా ఫలితం లేకపోయిందని ఆయన గుర్తు చేశారు. "ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే విమానయాన సేవలను ప్రారంభించేందుకు అవసరమైన ప్రక్రియను ప్రారంభిస్తామని 6 అక్టోబర్, 2021న.. నాటి పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ముఖ్యమంత్రికి లేఖ రాసినట్లు గుర్తు చేశారు కిషన్ రెడ్డి.
వరంగల్ విమానాశ్రయానికి అనుమతులు రావడంపై కిషన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ పూర్తి చేస్తే, మిగతా పనులు కూడా త్వరగా పూర్తి చేస్తామని ఆయన అన్నారు. వరంగల్ ప్రజల కల త్వరలోనే నెరవేరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గత నెలలో వరంగల్ విమానాశ్రయం గురించి తాను, రామ్మోహన్ నాయుడు కలిసి మాట్లాడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సూచన చేశారు. వరంగల్ విమానాశ్రయం కోసం అవసరమైన భూమిని త్వరగా సేకరించాలని కోరారు. భూమి ఇస్తే, మిగతా పనులను వేగంగా పూర్తి చేయవచ్చని ఆయన అన్నారు. తద్వారా వరంగల్ ప్రజల కల త్వరగా నెరవేరుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.