![]() |
![]() |
by Suryaa Desk | Sat, Apr 05, 2025, 08:34 PM
తెలంగాణలోని నిరుద్యోగులకు స్వయం ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాసం పథకాన్ని తీసుకొచ్చింది. అయితే ఇప్పటి వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించగా.. ఇప్పుడు ఆఫ్‌లైన్‌లో కూడా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఇంతకుముందు మీ సేవ కేంద్రాల్లో మాత్రమే దరఖాస్తులు తీసుకునేవారు. ఇప్పుడు ఆఫ్‌లైన్‌లో కూడా అవకాశం కల్పించారు. దీనికి సంబంధించిన దరఖాస్తు పత్రాలు ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడంలో సమస్యలు ఎదురైనవారు మాత్రమే ఆఫ్‌లైన్‌ను ఉపయోగించాలని అధికారులు సూచిస్తున్నారు.
ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసేవారి కోసం ప్రభుత్వం నమూనా దరఖాస్తులను విడుదల చేసింది. దరఖాస్తులో 27 అంశాలకు సంబంధించిన వివరాలు నింపాలి. ఆధార్ కార్డును జత చేయాలి. ఆహార భద్రత కార్డు లేదా ఆదాయ ధ్రువపత్రం రెండింటిలో ఏదో ఒకటి జత చేస్తే సరిపోతుంది. కుల ధ్రువపత్రం, దివ్యాంగులైతే సదరం ధ్రువపత్రం కూడా జత చేయాలని అధికారులు చెబుతున్నారు. ఆఫ్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను సేకరించి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు.
రాజీవ్ యువ వికాసం పథకాన్ని ఉపయోగించి పరిశ్రమలు స్థాపించేలా అధికారులు అవగాహన కల్పిస్తారు. ప్రతి మండల పరిషత్, మున్సిపల్ కార్యాలయాల్లో ‘రాజీవ్ యువ వికాసం’ హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేయాలని కలెక్టర్లు ఆదేశించారు. దరఖాస్తులు స్వీకరించి వాటిని ఆన్‌లైన్‌లో నమోదు చేయడానికి సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సూచించారు. పురపాలికల్లో వార్డు అధికారులు ఆఫ్‌లైన్ దరఖాస్తుల బాధ్యతలు చూసుకుంటారు.
కాగా, ఈ పథకం కింద రూ. 50,000 కంటే తక్కువ రుణాలకు 100 శాతం సబ్సిడీ ప్రకటించారు. రూ. 1 లక్ష వరకు రుణాలకు 80 శాతం సబ్సిడీ, రూ. 1 లక్ష నుండి రూ. 2 లక్షల వరకు 70 శాతం సబ్సిడీ, రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు - 60 శాతం సబ్సిడీ ఇవ్వనున్నారు. అర్హులైన యువత దరఖాస్తులను https://tgobmms.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా సమర్పించవచ్చు.