|
|
by Suryaa Desk | Fri, May 02, 2025, 03:54 PM
UPI ద్వారా చేసే లావాదేవీలు ఇకపై మరింత వేగంగా పూర్తి కానున్నాయి. ఈ మేరకు తాజాగా నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక కీలక ప్రకటన చేసింది. ఇప్పటివరకు యూపీఐ ద్వారా ఎవరికైనా డబ్బులు పంపినప్పుడు, ఆ లావాదేవీ సక్సెస్ కావడానికి కొంత సమయం పట్టేది. ఇక, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత 'సక్సెస్' అని వచ్చే వరకు ఎదురు చూడాల్సి వచ్చేది. కొన్నిసార్లు ఈ సమయం కాస్త ఎక్కువగానే ఉండేది. అయితే, ఇకపై ఈ నిరీక్షణ సమయం దాదాపు 50 శాతం తగ్గనుంది. జూన్ 16 నుంచి సవరించిన సమయం అమల్లోకి రానుంది. ఈ మేరకు ఎన్‌పీసీఐ తాజాగా ఓ సర్క్యులర్ జారీ చేసింది. ఒక లావాదేవీ పూర్తవడానికి పట్టే సమయాన్ని రెస్పాన్స్ సమయంగా వ్యవహరిస్తారు. ఎన్‌పీసీఐ తాజా ఆదేశాల ప్రకారం.. క్రెడిట్/డెబిట్‌కు సంబంధించిన లావాదేవీలు కేవలం 15 సెకన్లలోనే పూర్తవుతాయి. ప్రస్తుతం దీనికి 30 సెకన్లు పడుతోంది. అంతేగాక ట్రాన్సాక్షన్ స్టేటస్ తెలుసుకోవడం, విఫలమైన లావాదేవీల రివర్సల్, చిరునామా ధ్రువీకరణ వంటి ప్రక్రియలు కూడా 30 సెకన్ల నుంచి కేవలం 10 సెకన్లకు తగ్గనున్నాయి.యూజర్ల అనుభవాన్ని మెరుగుపరచడానికే ఈ మార్పులు చేస్తున్నట్లు ఎన్‌పీసీఐ తన ప్రకటనలో తెలిపింది. పేటీఎం, ఫోన్‌పే వంటి పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు, బ్యాంకులు జూన్ 16 నాటికి రెస్పాన్స్ సమయం తగ్గేందుకు తమ వ్యవస్థలను సిద్ధం చేసుకోవాలని సూచించింది.