|
|
by Suryaa Desk | Fri, May 02, 2025, 03:55 PM
భువనేశ్వర్‌లోని ప్రతిష్ఠాత్మక కళింగ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ (కిట్)లో మరో విషాదం చోటుచేసుకుంది. యూనివర్సిటీకి చెందిన బాలికల హాస్టల్ గదిలో నేపాల్ విద్యార్థిని గురువారం సాయంత్రం విగతజీవిగా కనిపించింది. మూడు నెలల వ్యవధిలో ఇదే క్యాంపస్‌లో నేపాల్ విద్యార్థిని మృతి చెందడం ఇది రెండోసారి కావడంతో తీవ్ర కలకలం రేపుతోంది.పోలీసుల కథనం ప్రకారం.. మృతురాలు కంప్యూటర్ సైన్స్ బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమె స్వస్థలం నేపాల్ రాజధాని కఠ్మాండుకు సుమారు 135 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీర్‌గంజ్. గురువారం రాత్రి 8 గంటల సమయంలో బాలికల హాస్టల్‌లోని తన గదిలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకున్న స్థితిలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు. వెంటనే యూనివర్సిటీ అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరించారు. భువనేశ్వర్-కటక్ పోలీస్ కమిషనర్ సురేష్ దేవ్‌దత్తా సింగ్ మాట్లాడుతూ, ‘కిట్ యూనివర్సిటీలో నేపాల్‌కు చెందిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నట్టు మాకు సమాచారం అందింది. మేం సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించాం. శాస్త్రీయ బృందం వచ్చి అవసరమైన ఆధారాలు సేకరించింది. సమగ్ర విచారణ జరుపుతాం. మృతురాలి కుటుంబ సభ్యులకు సమాచారం అందించాం. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఎయిమ్స్‌కు తరలించాం’ అని తెలిపారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల స్పష్టమైన కారణాలు తెలుస్తాయని, ప్రస్తుతానికి దీనిని అనుమానాస్పద మృతి (ఆత్మహత్య కోణంలో)గా పరిగణిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.