|
|
by Suryaa Desk | Mon, Jun 02, 2025, 01:22 PM
తెలంగాణ రాష్ట్రం 11 వసంతాలు పూర్తిచేసుకుని 12వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ చారిత్రక దినాన, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన పోరాటంలో తమ ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులను ఆయన స్మరించుకున్నారు. వారి ఆత్మశాంతికి ప్రార్థిస్తూ, వారి త్యాగనిరతిని కొనియాడారు.రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రేవంత్‌రెడ్డి నేడు తన సందేశాన్ని విడుదల చేశారు. "తెలంగాణ ప్రజలంతా ఐక్యంగా పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నారు. ఈ రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తయ్యాయి. మనం ఇప్పుడు 12వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాం" అని పేర్కొన్నారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ప్రతిరూపంగా తమ ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్’ అనే నినాదాన్ని ముందుకు తెచ్చిందని సీఎం వెల్లడించారు. ఈ నినాదం రాష్ట్ర ప్రగతికి, ప్రజల ఉన్నతికి అద్దం పడుతుందని అభిప్రాయపడ్డారు.