|
|
by Suryaa Desk | Mon, Jun 02, 2025, 01:35 PM
హైదరాబాద్‌లో మరో భారీ ఆర్థిక మోసం వెలుగులోకి వచ్చింది. తక్కువ కాలంలో పెట్టుబడిని రెట్టింపు చేస్తామంటూ ఆశ చూపి, వందల మంది నుంచి సుమారు 150 కోట్ల రూపాయలు వసూలు చేసి ఓ సంస్థ బోర్డు తిప్పేసింది. ఈ ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పెంగ్విన్ సెక్యూరిటీస్ పేరుతో కార్యకలాపాలు సాగించిన ఈ సంస్థ నిర్వాహకుల మోసపూరిత మాటలు నమ్మి వేలమంది తమ కష్టార్జితాన్ని కోల్పోయారు.మూడేళ్ల క్రితం జీడిమెట్ల కేంద్రంగా పెంగ్విన్ సెక్యూరిటీస్ అనే సంస్థ కార్యకలాపాలు ప్రారంభించింది. కనీసం లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే 20 నెలల్లో రెట్టింపు చేసి ఇస్తామని నమ్మబలికారు. ప్రజలను ఆకర్షించేందుకు, నమ్మకం కలిగించేందుకు ఆరంభంలో కొంతమందికి చెప్పినట్లుగానే డబ్బులు చెల్లించారు. దీంతోపాటు బాండ్లు కూడా జారీ చేయడంతో చాలా మంది ఈ సంస్థను నమ్మారు."మొదట్లో అంతా బాగానే నడిచింది. లక్షకు రెండు లక్షలు, పది లక్షలకు ఇరవై లక్షలు చొప్పున కొందరికి తిరిగి ఇచ్చారు. ఇది చూసి జనం మరింతగా ఆకర్షితులయ్యారు. అప్పులు చేసి, బంగారం తాకట్టు పెట్టి మరీ లక్షలకు లక్షలు ఈ సంస్థలో పెట్టుబడి పెట్టారు" అని ఓ బాధితుడు వాపోయాడు. తాను కూడా మొదట లాభం పొంది, రెండోసారి 5 లక్షలు పెట్టుబడి పెట్టానని, ఇప్పుడు ఆ మొత్తం పోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు.ఈ సంస్థను వడైగర్ బాలాజీ చౌదరి, స్వాతి మరికొంతమందితో కలిసి ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. మూడేళ్లపాటు సజావుగా కార్యకలాపాలు నిర్వహించి ప్రజల నుంచి కోట్లాది రూపాయలు పోగు చేసుకున్న తర్వాత, నిర్వాహకులు ఇటీవల కార్యాలయానికి తాళాలు వేసి పరారయ్యారు. తాము మోసపోయామని గ్రహించిన బాధితులు లబోదిబోమంటూ జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.