|
|
by Suryaa Desk | Mon, Jun 02, 2025, 08:13 PM
తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు, లక్ష్యాలకు అనుగుణంగా మన అందరం కలసి పని చేయాలని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు సూచించారు. ఎన్నో కలలు గని ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాం. ఆ కలలు సాకారం అయ్యేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని కోరారు. సోమవారం హైడ్రా కార్యాలయం ముందు జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో శ్రీ ఏవీ రంగనాథ్‌గారు మాట్లాడారు. ఔటర్ రింగు రోడ్డు వరకూ పరిధిని నిర్దేశించి హైడ్రాను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. చెరువులు, నాలాలు, ప్రభుత్వ, ప్రజా ఆస్తులను పరిరక్షించడంతో పాటు.. ప్రకృతి వైపరీత్యాలలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ప్రజలకు అండగా ఉండేలా పని చేయాలని రాష్ట్ర ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. ఆ దిశగా అందరూ కలసి పని చేయాలని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ గారు సూచించారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో ఎంతో మంది ప్రాణాలు అర్పించారు.. రాష్ట్రం అన్ని రంగాల్లో సుభిక్షంగా ఉండాలని రాష్ట్ర గీతం చాటి చెబుతోంది.. ఆ లక్ష్యాలు నెరవేరేందుకు అందరూ కలసికట్టుగా కృషి చేయాలన్నారు.