|
|
by Suryaa Desk | Sat, Nov 15, 2025, 04:32 PM
సైబర్ నేరగాళ్లు సామాన్యులనే కాదు, ఉన్నతాధికారులను సైతం వదలడం లేదు. తాజాగా సీనియర్ ఐపీఎస్ అధికారి, హైదరాబాద్ సీపీ సజ్జనార్ పేరుతో సైబర్ కేటుగాళ్లు మోసాలకు పాల్పడ్డారు. ఆయన పేరుతో ఓ నకిలీ ఫేస్‌బుక్ ఖాతా సృష్టించి, ఆయన స్నేహితుడి నుంచి రూ.20,000 కాజేశారు. ఈ విషయాన్ని సజ్జనార్ స్వయంగా ‘ఎక్స్’ వేదికగా వెల్లడించి ప్రజలను అప్రమత్తం చేశారు. తన పేరుతో ఫేక్ ఫేస్‌బుక్ ఖాతా సృష్టించిన మోసగాళ్లు, అందులో నుంచి తన స్నేహితులకు సందేశాలు పంపారని సజ్జనార్ తెలిపారు. తాను ఆపదలో ఉన్నానని, అత్యవసరంగా డబ్బు కావాలని కోరగా.. అది నిజమేనని నమ్మిన ఓ స్నేహితుడు రూ.20,000 వారి ఖాతాకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు. తన అధికారిక ఖాతా ( https://facebook.com/share/1DHPndApWj/) మినహా మిగిలినవన్నీ నకిలీవేనని ఆయన స్పష్టం చేశారు.ఈ సందర్భంగా ప్రజలకు ఆయన పలు కీలక సూచనలు చేశారు. తన పేరుతో గానీ, ఇతర ప్రముఖుల పేర్లతో గానీ ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు వస్తే స్పందించవద్దని కోరారు. డబ్బులు పంపాలని వచ్చే సందేశాలను అసలు నమ్మవద్దని, ఒకవేళ అలాంటివి వస్తే ముందుగా సంబంధిత వ్యక్తికి ఫోన్ చేసి నిర్ధారించుకోవాలని సూచించారు. అనుమానాస్పద లింకులు, మెసేజ్‌లు వస్తే వెంటనే బ్లాక్ చేసి, సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.