by Suryaa Desk | Tue, Nov 19, 2024, 06:26 PM
తెలంగాణ ఉన్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. తెలంగాణ రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ చెల్లదంటూ ఊహించని షాక్ ఇచ్చింది. అది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు.. గత ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 16ను కొట్టేస్తూ.. హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించేందుకు కేసీఆర్ సర్కార్ జీవో 16 తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ జీవో ద్వారా సుమారు 8 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను బీఆర్ఎస్ ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసింది. అందులోనే.. విద్య, వైద్య శాఖల్లోనే ఎక్కువ మంది కాంట్రాక్టు ఉద్యోగులను ప్రభుత్వం క్రమబద్దీకరించింది.
అయితే.. ప్రభుత్వం తెచ్చిన జీవో 16ను తెలంగాణ నిరుద్యోగ జేఏసీ పూర్తిగా వ్యతిరేకించింది. రాష్ట్రంలోని నిరుద్యోగుల పాలిట శాపంగా మారిందని.. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి తమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని మండిపడింది. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమైన చర్య అని ఆరోపిస్తూ.. జీవో 16ను సవాల్ చేస్తూ తెలంగాణ నిరుద్యోగ జేఏసీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారించిన ఉన్నత న్యాయస్థానం.. జీవో 16 పూర్తిగా రాజ్యాంగ విరుద్దమని తాజాగా తీర్పు వెల్లడించింది.
అయితే.. జీవో 16పై హైకోర్టు ఇచ్చిన తీర్పుతో.. రెగ్యులరైజ్ అయిన కాంట్రాక్టు ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోంది. రెగ్యులరైజ్ అయ్యి ఆనందంగా ఉన్న సమయంలో.. తమ నియామకాలు చెల్లవని హైకోర్టు చెప్పడంతో.. ప్రస్తుతం వారి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు.. ఎప్పటికైనా తమ ఉద్యోగం రెగ్యులరైజ్ అవుతుందని నమ్మకం పెట్టుకున్న ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. హైకోర్టు తీర్పుతో.. ఇప్పటికే రెగ్యులరైజ్ అయిన ఉద్యోగులను అలాగే కంటిన్యూ చేస్తారా.. వారిని మళ్లీ కాంట్రాక్ట్ ఉద్యోగులుగానే పరిగణిస్తారా అన్నది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఎదైనా నిర్ణయం తీసుకుటుందా లేదా అన్నది ఉత్కంఠగా మారింది.
కాగా.. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య లేకుండా చేయాలని కంకణం కట్టుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ఆయా శాఖల్లో కలిపి ఇప్పటికే 50 వేల నియమకాలు చేపట్టినట్టు చెప్తోంది. గ్రూప్-1 పరీక్షలు నిర్వహించగా.. గ్రూప్-3 పరీక్షలు కూడా నిర్వహించింది. ఇక.. మిగతా శాఖల్లోనూ ఖాళీల భర్తీకి చర్యలు చేపడుతుంది. ఈ క్రమంలోనే.. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తూ.. ఎప్పటికప్పుడు ఖాళీల భర్తీ చేపట్టనున్నట్టు ప్రభుత్వం చెప్తోంది. ఈ క్రమంలో.. కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఎలాంటి వెసులుబాటు కల్పిస్తుందన్నది మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయకపోవటం గమనార్హం.