by Suryaa Desk | Tue, Nov 19, 2024, 04:41 PM
మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆక్రమణలకు పాల్పడ్డారని తమకు ఫిర్యాదులు వచ్చాయని, అలాగే, పార్కులు, రోడ్లు కబ్జాకు గురైనట్లు కూడా కొంతమంది ఫిర్యాదు చేశారని, విచారణ చేసి నిజమని తేలితే హైడ్రా తప్పకుండా చర్యలు తీసుకుంటుందని కమిషనర్ ఏవీ రంగనాథ్ వెల్లడించారు.హైడ్రా కమిషనర్ రంగనాథ్ అమీన్‌పూర్ పెద్ద చెరువును సందర్శించారు. స్థానికుల విజ్ఞప్తి మేరకు ఆయన ఈ చెరువును సందర్శించారు. వెంకటరమణ కాలనీ, శంభునికుంట, అమీన్‌పూర్ పెద్ద చెరువు, హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీ, పద్మారావు నగర్ సరిహద్దు ప్రాంతాల్లో పర్యటించారు. స్థానికులతో మాట్లాడారు.అనంతరం ఆయన మాట్లాడుతూ... పెద్ద చెరువు ముంపు బాధితులకు హైడ్రా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అమీన్‌పూర్ పెద్ద చెరువుకు సంబంధించి అనేక ఫిర్యాదులు వచ్చినట్లు చెప్పారు. అలుగులు, తూములు మూసేయడంతో ఎఫ్‌టీఎల్ పెరిగినట్లు స్థానికులు ఫిర్యాదు చేశారని తెలిపారు. దీనిని ప్రత్యేక టెక్నికల్ బృందంతో సర్వే చేయిస్తామన్నారు. సర్వే నివేదిక ఆధారంగా ప్రభుత్వంతో చర్చించి మూడు నెలల్లో ఫలితాలతో వస్తామని హామీ ఇచ్చారు.అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని మరికొన్ని ప్రాంతాలు ఆక్రమణకు గురైనట్లు తమకు సమాచారం అందిందన్నారు. అన్నింటి పైనా పూర్తిస్థాయి విచారణ జరిపిస్తామన్నారు. ఈ మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ భూమి ఎక్కువగా ఉందని, అందుకే కబ్జాలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు. తాము చెరువుల పునరుద్ధరణను ప్రధాన అజెండాగా పెట్టుకున్నామని, అయితే ఆక్రణకు గురైన రోడ్లను కూడా పునరుద్ధరిస్తామన్నారు. అధికారులు తప్పు చేసినట్లు తేలినా చర్యలు ఉంటాయని తేల్చి చెప్పారు.స్థానికుల ఫిర్యాదుపై స్పందించిన కమిషనర్ తమ భూములు కబ్జాకు గురవుతున్నాయని స్థానికులు హైడ్రా కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. చెరువులోని నీరు తూముల ద్వారా కిందకు వదలడంతో ఎగువన ఉన్న తమ నివాసాలు మునిగిపోయినట్లు హైడ్రా కమిషనర్ దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ అంశంపై నిపుణుల కమిటీని వేసి నివేదికను తెప్పించుకుంటానని హైడ్రా కమిషనర్ హామీ ఇచ్చారు. ఈ నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తానన్నారు. ప్రభుత్వం ఆదేశాల ప్రకారం చర్యలు ఉంటాయన్నారు.