by Suryaa Desk | Tue, Nov 19, 2024, 07:03 PM
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ ఫుల్లుకో... హాఫ్ కో బ్రాండ్ అంబాసిడర్ అని తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజలను మద్యం మత్తులో ఉంచి అధికారంలో ఉండాలని భావించాడని, కానీ తెలంగాణ ప్రజలు తేరుకొని దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చారన్నారు. కేసీఆర్ ఫాంహౌస్‌లోనే ఉండాలని... తామే మందు పంపిస్తామన్నారు. దానికి డబ్బులు కూడా తామే కడతామన్నారు. తాగబోతుల సంఘానికి ఏకగ్రీవ అధ్యక్షుడు కేసీఆర్ అంటూ ఎద్దేవా చేశారు. హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన విజయోత్సవ సభలో సీఎం పాల్గొన్నారు.తెలంగాణ ప్రజలు పది నెలల కాలంలో ఎంతో కోల్పోయారని చెబుతున్నారని, కానీ వారు కోల్పోయిందేమీ లేదన్నారు. పైగా కోల్పోయిన స్వేచ్ఛ, స్వాతంత్రాలు దొరికాయన్నారు. కేసీఆర్ ఇంట్లో మాత్రం నలుగురు వ్యక్తులు ఉద్యోగం కోల్పోయారని చురక అంటించారు. రుణమాఫీ చేస్తానని మాట ఇచ్చి పదేళ్లలో కూడా చేయలేకపోయాడని కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ తాము పది నెలల కాలంలోనే రూ.18 వేల కోట్లు మాఫీ చేశామన్నారు. కేసీఆర్ బయటకు ఎందుకు రావడం లేదు... ఒక్కసారి ఓడిస్తే ప్రజల మొహం చూడరా? అని ప్రశ్నించారు. ప్రజల మీద ప్రేమ ఉంటే వారి మధ్యకు ఎందుకు రావడం లేదో చెప్పాలన్నారు. రాహుల్ గాంధీని చూసి కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ... వరంగల్‌ను అభివృద్ధి చేస్తే సగం తెలంగాణ అభివృద్ధిలోకి వచ్చినట్లే అన్నారు. ఉత్తర తెలంగాణకే తలమానికంగా వరంగల్‌ను తీర్చిదిద్దుతామన్నారు. గత ప్రభుత్వం చేయలేని పనులను కిరాయి రౌడీలతో అడ్డుకుంటోందని ఆరోపించారు. ఆడబిడ్డలను కోటీశ్వరులుగా చేయాలని తమ ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. పది నెలల కాలంలో తాము 50 వేల ఉద్యోగాలు ఇచ్చామన్నారు.ఇందిరమ్మ రాజ్యం రావాలని తెలంగాణ ప్రజలంతా కోరుకున్నారన్నారు. తమను దీవించి పదవులు ఇచ్చిన ప్రజలకు అండగా ఉండాల్సిన బాధ్యత తమదే అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొన్నేళ్లపాటు మహిళా మంత్రి కూడా లేని పరిస్థితి ఉందని గుర్తు చేశారు. కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేసేందుకు గత పదేళ్లు మనసొప్పలేదని విమర్శించారు. తెలంగాణ భావజాలాన్ని వ్యాప్తి చేయడంలో కాళోజీ పాత్ర ఎంతో ఉందని కొనియాడారు. తాము పట్టుదలతో కాళోజీ క్షేత్రాన్ని పూర్తి చేశామన్నారు.