by Suryaa Desk | Tue, Nov 19, 2024, 07:57 PM
రాబోయే తరాలను దృష్టిలో ఉంచుకుని, హైదరాబాద్ తరహాలో వరంగల్‌ను అన్ని రంగాల్లో సమానంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.వరంగల్ అభివృద్ధి కోసం అద్భుతమైన మాస్టర్ ప్లాన్ రూపొందించామని, ఈ నగర చుట్టూ మూడు విడతల్లో ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు.మంగళవారం హనుమకొండలో నిర్వహించిన ప్రజా పాలన-ప్రజా విజయోత్సవ సభలో మంత్రి మాట్లాడారు. ఇప్పటి వరకు ఈ జిల్లాకు రూ.5,213 కోట్ల నిధులు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయిన మామునూరు ఎయిర్ పోర్టు నిర్మాణం త్వరలో పూర్తవుతుందని తెలిపారు.భూసేకరణ కోసం ఇప్పటికే రూ.205 కోట్లను ప్రభుత్వం విడుదల చేసిందని, ఇందిరమ్మ ప్రభుత్వ హయాంలో ఎయిర్ పోర్టు నిర్మాణాన్ని వేగవంతం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. "వరంగల్ అభివృద్ధి ద్వారా ఈ ప్రాంతం రాష్ట్రంలో రెండో అతిపెద్ద కేంద్రంగా నిలవనుంది" అని అన్నారు.